KTR | సిటీబ్యూరో, మే 3(నమస్తే తెలంగాణ): ప్రజల కష్టాలకు కారణమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, అటు బడే భాయ్ మోదీ.. ఇటు చోటా భాయ్ రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. 2014లో మోదీ మస్తు మాటలు చెప్పారని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల నగదు, ఇల్లు, ప్రతి ఇంటికి నల్లా, రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ ట్రైన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ 12 ఏండ్లలో ఆయన చేసిందేమీలేదన్నారు.
పేదలను కొట్టాలె.. పెద్దలకు పెట్టాలె అనేది నరేంద్ర మోదీ సిద్ధాంతమని, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి జన జీవనాన్ని ఆగం చేశాడని కేటీఆర్ మండిపడ్డారు. మన ముక్కు పిండి వసూలు చేసిన రూ.30 లక్షల కోట్లలో రూ.14.5 లక్షల కోట్లు ఆదానీ, అంబానీలకు రుణమాఫీ చేసిండు అని ఆరోపించారు. తాను చెప్పింది అబద్ధమని కిషన్‌రెడ్డి నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా సికింద్రాబాద్, సనత్‌నగర్, నాంపల్లి నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట రియో పాయింట్, సీతాఫల్మండి, సనత్‌నగర్‌లోని బబ్బార్ కాంప్లెక్స్, నాంపల్లిలోని నోబుల్ టాకీస్ చౌరస్తా వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అలవీ కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాలుగున్నర నెలల్లో ప్రజలకు కరెంట్, తాగునీటి కష్టాలు తెచ్చి పెట్టిందని, రేవంత్‌రెడ్డి చెప్పిన వాటిలో ఒక్కటైనా అమలు కాలేదన్నారు. కరెంట్ కోతలు, నీటి ఘోసలతో హైదరాబాద్‌లో మళ్లీ పాత రోజులు వచ్చాయన్నారు. ఈ ఎన్నికల్లో 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలిపిస్తే, మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని కేటీఆర్ అన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్, అర్వింద్, సోయం బాపూరావు, రఘునందన్, ఈటల రాజేందర్‌లను ఓడించింది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌ను ఓడించాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆరు గ్యారెంటీల్లో 5 హామీలను అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎంపీగా సికింద్రాబాద్‌కు కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని తలసాని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్ అంటేనే హిందువు అవుతారా? సనత్‌నగర్ నియోజకవర్గంలో తాను నిర్మించినన్నీ దేవాలయాలు ఎవరూ నిర్మించలేదన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే పద్మారావును భారీ మెజార్టీతో గెలిపించాలని తలసాని కోరారు.
ఐదేండ్లలో రూపాయి పనిచేయని కిషన్‌రెడ్డి మనకు అక్కరకు రాని చుట్టమని కేటీఆర్ అన్నారు. ఐదేండ్ల పాటు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్‌రెడ్డి అటు రాష్ర్టానికి, ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్‌కు ఆయన చేసిందేమి లేదని కేటీఆర్ మండిపడ్డారు. కాలనీలు వరదల్లో మునిగినా..కరోనా వచ్చినా , మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ, ఫ్లై ఓవర్లు కడతామన్న సహకారం అందించలేదన్నారు. కిషన్‌రెడ్డి చేసిందేమి అంటే.. ఒక కుర్ కురే ప్యాకెట్లు మాత్రం పంచాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
గుజరాత్‌కు వరదలు వస్తే కేంద్రం రూ.వెయ్యి కోట్లు సాయం చేసిందని, రాష్ట్రం కోసం అడిగేందుకు కిషన్‌రెడ్డికి నోరు రాలేదా ? అని ప్రశ్నించారు. ఓట్ల అడిగే ముందు దమ్ముంటే కిషన్‌రెడ్డి ఐదేండ్లలో ఏం చేశావో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. గులాబీ కండువాతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఖైరతాబాద్ ప్రజల తీర్పును అపహాస్యం చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ కండువాతో నిస్సిగ్గుగా ఓట్లు అడుగుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అవకాశవాదులు, విశ్వాసఘాతకుడికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
సికింద్రాబాద్ శాసనసభ్యుడే ఈ సారి పార్లమెంట్ సభ్యుడిగా పద్మారావు కాబోతున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌కు తమ్ముడి లాంటి నేత పద్మారావు గౌడ్ అని, ఎన్ని కష్టాలు వచ్చినా సరే పద్మారావు కేసీఆర్‌తోనే నడిచారని, 40 ఏండ్ల ప్రజాజీవితంలో పేద ప్రజలకు కష్టం వస్తే ఏ గల్లీకి అయినా, ఎక్కడికైనా వెంటనే వాలిపోతాడు మన పజ్జన్న అని చెప్పారు. లక్ష మెజార్టీతో పద్మారావుకు పట్టం కట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పద్మారావును ఎంపీగా గెలిపిస్తే నాంపల్లిలో ఎంపీ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ అన్నారు.