హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి మోసపూరిత కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డికి ఓటమి రుచి చూపించి, కండ్లు తెరిపిస్తేనే ఆరు గ్యారెంటీలు, 420 హామీలు గుర్తుకొస్తాయని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి, దగా చేసిన హస్తంపార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని కోరారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్లో రోడ్‌షో నిర్వ హించారు. ఈ సందర్భంగా తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. వీడియోలు ప్రదరిస్తూ రెండేళ్లలో రేవంత్ సర్కారు మోసపూరిత హామీలను ఎండగట్టారు. గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగిందని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలు అందించి అండగా నిలిచారని పేర్కొన్నారు.
హైడ్రా పేరిట దుర్మార్గాలు
సీఎం రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన వెంటనే ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కి హైడ్రా పేరిట దుర్మార్గాలకు తెరలేపారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చెరువుల్లో ఇండ్లు కట్టుకున్న వారు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎఫ్టీఎల్లో కట్టిన మంత్రులు పొంగులేటి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ ఇండ్లను వదిలిపెట్టి గరిబోళ్ల గూళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. పేదలకు నిలువ నీడ లేకుండా చేసి రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు.
కారుకు బుల్డోజర్కు మధ్య పోటీ
జూబ్లీహిల్స్‌లో హైడ్రా పేరిట అరాచకం సృష్టించిన కాంగ్రెస్ బుల్డోజర్కు పదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ఇమేజ్ పెంచిన కారు పార్టీకి పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. మోకా ఇస్తే ఢోకా చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌లో గట్టి షాక్ ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు. నాలుగు లక్షల మంది ఓటర్ల తీర్పు కోసం నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. మళ్లీ ఓటేస్తే మరో మూడేళ్లు నరకం అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని విస్మరించొద్దని సూచించారు. కారు పార్టీకి కత్తి ఇస్తేనే కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నడుచుకుంటూ వస్తాయన్నారు. చెల్లెళ్లకు స్కూటీలు వస్తాయని, అక్కలకు ప్రతినెలా రూ. 2,500 ఖాతాల్లో పడతాయని, అవ్వాతాతలకు రూ.4 వేల పింఛన్లు వస్తాయని చెప్పారు. అందుకే కాంగ్రెస్‌కు దిమ్మతిరిగేలా ఓటుతో తగిన బుద్ధిచెప్పాలని విజ్ఞప్తి చేశారు.