‘అందినంత దోచుకో.. దోచిందంతా దాచుకో.. అన్నట్లుగా రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా.. మొత్తానికి మంత్రులే మాఫియా అయిపోయారని ఎద్దేవా చేశారు. ఈ దండుపాళ్యం దొంగల ముఠాకు అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అని అన్నారు. ఇప్పుడు నగరంలో విధ్వంసం కొనసాగుతున్నదని, మూసీ..హైడ్రా పేరుతో ప్రజలను పీడిస్తున్నారని, ఒక్క ఇల్లు కట్టకున్నా.. వేల ఇండ్లు కూలగొట్టారన్నారు. జీవో 59 కింద రెండున్నర లక్షల పేదలకు పట్టాలిచ్చిన మహానేత కేసీఆర్ అని గుర్తు చేశారు.
శంషాబాద్ జేడీ కన్వెన్షన్‌లో ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం, సర్(ఎస్ఐఆర్)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్.. గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అరాచక, అసమర్థత పాలన కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలన్న ఏకైక ఆలోచన ప్రజల్లో ఉన్నదని చెప్పారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అధికార పార్టీలోకి పోయినా.. క్యాడర్ మాత్రం ఎక్కడా పోలేదన్నారు. ఇక్కడ మళ్లీ
ఎగిరేది గులాబీ జెండానేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
-మణికొండ, జూన్ 21

Ktr
మణికొండ, జూన్ 21 : ‘అందినంత దోచుకో… దోచిందంతా దాచుకో’ అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో మాఫియా రాజకీయం నడుస్తున్నదని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ జేడీ కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం, సర్(ఎస్ఐఆర్) అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్‌రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అరాచక, అసమర్థత పాలన కొనసాగుతుందన్నారు.
కాంగ్రెస్ పోవాలే..కేసీఆర్ రావాలే అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాజేంద్రనగర్‌కు వస్తున్న రహదారిలో కల్పనా అనే అమ్మాయి తన కారుకు అడ్డుగా వచ్చి కలిసిందని కేటీఆర్ చెప్పారు. ఆమె కళ్లల్లో నీళ్లు పెట్టుకుని ‘అన్నా.. ఎప్పుడోస్తావన్నా..’ అంటూ అడిగింది. ‘కాంగ్రెస్ ప్రభుత్వ చేతిలో దగాపడ్డ రైతుబిడ్డ, సామాన్య మహిళ, పెద్ద మనిషి, రెండు లక్షల ఉద్యోగాలంటూ మోసపోయిన చెల్లెల్లు, తమ్ముళ్లు .. ఇలా అందరి గుండెల్లో ఒక్కటే ఉన్నది.. కాంగ్రెస్ పోవాలే..కేసీఆర్ రావాలే అనే నినాదంతో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
ఇప్పుడు మనం క్యాలెండర్ ఎప్పుడు మారుతదో అని చూడాలే తప్ప మరొకటి లేదన్నారు. ముమ్మాటికీ కాంగ్రెస్ ఖేల్ ఖతం కేసీఆర్ వచ్చుడు ఖాయం అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శంషాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి కార్డు ఇచ్చేందుకు తన వద్దకు వచ్చి కలిసి తన ఆవేదనను వెలిబుచ్చాడని తెలిపారు. తమ తాత, ముత్తాలకు చెందిన సుమారు 2వేల ఎకరాల భూమిలో నేడు మూడు, నాలుగు వందల ఎకరాలే మిగిలిందన్నారు. అయితే తనకు రెవెన్యూశాఖ కార్యాలయం నుంచి ఫోన్‌చేశారని తెలిపారు.
ఆయన అక్కడకు వెళ్లగానే ‘మీ భూమి అంతా ప్రొహిబిటెడ్ లిస్టు 22ఏలో పెట్టామని, మీపై స్థానిక రైతులు కొంతమంది ఫిర్యాదు చేశారు’ అంటూ బెదిరించినట్లు తెలిపారు. ‘ఇదేం సార్ మేము వందేళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ రికార్డులలో తమ పేర్లు వస్తున్నాయని, ఇప్పుడెందుకు అలా చేస్తున్నారని అడిగితే…మేము ఏమైనా ఊరికెనే గెలిచామా? వెయ్యి కోట్లు పెట్టి గెలిచాం అంటూ చెప్పారంటా… అయితే నీ పని కావాలంటే ఒక్కో ఎకరాకు రూ.కోటి ఇచ్చుకుంటే అప్పుడు ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తొలగిస్తామని చెప్పారని ఆయన తనకు చెప్పారని కేటీఆర్ వివరించారు.
తెలంగాణలో ఇప్పుడు కోటి ఎకరాలు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్త్తున్నారని బాధితుడు చెప్పారన్నారు. రెండేండ్లు తాను ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని నా భూమిని కాపాడుకుంటా.. కానీ ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చాక ఈ దొంగల భరతం పట్టాలే సార్ అంటూ వేడుకున్నాడన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అందినంత దోచుకో…దోచింది దాచుకో అన్న స్కీం రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా మొత్తానికి మంత్రులే మాఫియా అయిపోయారని ఎద్దేవ చేశారు.
ఈ దండుపాళ్యం దొంగల ముఠాకు అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. వట్టినాగులపల్లిలో ఓ సామాన్య కుటుంబానికి చెందిన భూముల్లో రెవెన్యూ మంత్రి కొడుకు గుండాలతో పోయి కబ్జా చేసేందుకు యత్నించాడని, ఈ విషయంలో ఓ నిజాయితీ గల పోలీస్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేస్తే బలి చేశారని గుర్తుచేశారు. ఈ 420ల పాలనలో రాష్ట్రం నలిగిపోతుందన్నారు. హైదరాబాద్ అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులకు స్వర్గదామం, ప్రపంచ దిగ్గజ కంపెనీలకు చిరునామా, లా అండ్ ఆర్డర్‌కు కేరాఫ్ అడ్రస్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఉపాధి అవకాశాల అక్షయపాత్ర అన్నారు.
‘ప్రస్తుతం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం వెనుకాల పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు, పైసలు ఇస్తవా లేదా సస్తవా అని.. ఒకనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ వస్తే హైదరాబాదా… న్యూయార్కా అన్నారు’ అని గుర్తు చేశారు. ఇప్పుడు నగరంలో విధ్వంసం కొనసాగుతుందన్నారు. మూసీ పేరుపై… హైడ్రా పేరుతో ప్రజలను పీడిస్తున్నారని తెలిపారు. నాడు రెండున్నర లక్షల మంది పేదలకు జీవో 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. హైడ్రా బూతం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని లఘుచిత్రం ద్వారా కేటీఆర్ వివరించారు.
రాజేంద్రనగర్‌లో మళ్లీ గెలిచేది గులాబీ జెండానే….
రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అధికార పార్టీలోకి పోయినా క్యాడర్ మాత్రం ఎక్కడా పోలేదని… భవిష్యత్తులో రాజేంద్రనగర్‌లో ఎగిరేది గులాబీ జెండానేనని కేటీఆర్ అన్నారు. సమరానికి సై అంటూ నియోకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక్క ఇళ్లు కట్టారా? అని ప్రశ్నించారు. అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాలను గుర్తుంచుకుని ప్రజలు గుణపాఠం చేప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
420 హామీలెక్కడ పోయాయో తెలియదు.. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి. రెండున్నరేండ్ల సమయం పూర్తి అయింది. గోడ దూకిన ఎమ్మెల్యే ఏమైనా చేసిండా అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు. ఒక్క ఇళ్లు కట్టకున్నా వేల ఇళ్లు కూలగొట్టారని మండిపడ్డారు. ప్రశ్నించినోడిపై కేసులు తప్ప రేవంత్ సర్కారు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ హయాంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశామా లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పులు చేశారంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలకు చురకలంటిస్తూ వెయ్యి గురుకుల పాఠశాలలు, ఆరున్నర లక్షల పిల్లలపై లక్షా ఇరవై వేలు ఖర్చుపెట్టి నాణ్యమైన విద్యనందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.
మైనార్టీలకు 204 పాఠశాలలను నిర్మించి అందించామన్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంధకారంలో ఉన్న తెలంగాణకు అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లోనే 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్, ఇక్కడ కాటేదాన్ పారిశ్రామిక వాడలో మూడు షిఫ్ట్‌లు పనిచేసుకునేలా విద్యుత్ అందించారని గుర్తుచేశారు. ఇళ్లకు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, 70లక్షల మంది రైతులకు రూ.73వేల కోట్లను రైతుబంధు పేరిట వారి ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్‌దన్నారు.
రెండుసార్లు రుణమాఫీ చేసి రూ.30వేల కోట్లు ఖాతాల్లో జమచేశారన్నారు. కేవలం రైతులకే రూ.లక్షకోట్ల ఖాతాల్లో వేశారన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు లాంటి పథకాలు అమలు చేశారన్నారు. రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు. విద్యుత్ ఇవ్వవే. రైతుబంధు ఇవ్వలే, యూరియా ఇవ్వలే, పింఛన్లు ఇవ్వలే, పంట పండిస్తే ధాన్యం కొనడానికి సంచులు కూడా లేవన్నారు. సంచులు లేవని చూస్తే ఆ సంచులన్నీ ఢిల్లీకి పొతున్నాయని, రైతుబంధు బంధు అయ్యింది కానీ రాహుల్ బంధు మాత్రం బాగా నడుస్తుందన్నారు. ఈ సీఎం రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణిదేవి, నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, శాట్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ముఖీచంద్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేతల్లో ఫుల్ జోష్

Ktr
శంషాబాద్ రూరల్, జూన్ 21 : శంషాబాద్ సర్కిల్లోని జేడి కన్వేషన్హాల్లో ఆదివారం బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్ ప్రక్రియపై నియోజకవర్గ స్థాయి బూత్ ఇన్చార్జిల సమావేశం నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరై పార్టీ కార్యకర్తలకు సర్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. జూన్ 25 నుంచి ప్రారంభమై జూలై 31 వరకు జరిగే కార్యక్రమంలో బూత్ ఏజెంట్లు, పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి సబితారెడ్డితో కలిసి శంషాబాద్ కిషన్‌గూడ ఔటర్‌రింగ్ రోడ్డు వరకు చేరుకున్న వారికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు.
అక్కడి నుంచి భారీ ఎత్తున బైకు ర్యాలీతో కేటీఆర్‌ను శంషాబాద్ బస్‌స్టాండ్ వరకు తీసుకొచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ జోస్ నింపారు. దీంతో నాయకులు, కార్యకర్తలు సీఎం, సీఎం అంటూ కేటీఆర్ ఎదుట నినాదాలు చేయగా, కార్యకర్తలకు తన చిరునవ్వుతో అభివాదం చేశారు. శంషాబాద్‌లో ఎక్కడ చూసినా గులాబీ నేతల పోస్టర్లతోపాటు శంషాబాద్ కిషన్‌గూడ టోల్గేట్ నుంచి జేడి కన్వెన్షన్ వరకు గులాబీ కటౌట్లలో నిండిపోయాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ ప్రదీప్‌రెడ్డి, కొత్వాల్‌గూడ అధ్యక్షుడు కొన్నమొల్ల శ్రీనివాస్, మండలాధ్యక్షుడు మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి గౌస్‌పాషా, రాష్ట్ర నాయకుడు మంచర్ల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ బుర్కుంట సతీష్, సర్పంచ్ బిక్యానాయక్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఏ ఎన్నికలు వచ్చినా..
రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజల కోసం శక్తివంచన లేకుండా పనిచేసేందుకు మీ కోసం.. నేను అందుబాటులో ఉంటూ.. సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. అధికార పార్టీలో చేరి నియోజకవర్గానికి చేసిందేమిటో ప్రజలకు ఇప్పటికైనా చెప్పాలి. ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ సైన్యం గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.
– కార్తీక్‌రెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి
నాయకత్వ నిర్మాణం చేయాలి: శ్రీధర్
సంస్థాగతంగా పార్టీ బలంగా తయారుకావాలని అందుకు వ్యక్తి నిర్మాణం ప్రధానమని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు/సర్ కార్యక్రమ కో ఆర్డినేటర్ శ్రీధర్ అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 50వేల మంది క్రీయాశీల కార్యకర్తలను నమోదు చేస్తానని పార్టీ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి హామీ ఇచ్చారని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు సర్ కార్యక్రమాలపై బీఎల్ఏలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నాయకత్వ స్థాయి నిర్మాణం కావాలంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఎన్నికలు ఏవైనా రాని.. ఎప్పుడైనా రాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావడమే లక్ష్యంగా పనిచేద్దాం. బోగస్ ఓట్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. కొత్త ఓటర్ల చేరిక, పార్టీ సభ్యత నమోదుతో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి.
– సబితాఇంద్రారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే