 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తేతెలంగాణ): జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ వినూత్న తరహాలో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లనున్నది. జనంతో మమేకమై కాంగ్రె స్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపనున్నది. శుక్రవారం ప్రారంభించి నవంబర్ 9 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. పార్టీ డివిజన్ల ఇన్చార్జీలు, సీనియర్ నాయకుల నేతృత్వంలో ఎక్కడికక్కడ తమకు కేటాయించిన డివిజన్లు, బూత్‌లలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి. మాట ముచ్చటలో భాగం గా నియోజకవర్గంలోని వివిధ డివిజన్లల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పర్యటించనున్నారు. హోట ళ్లు, కిరాణా షాపులు, టీకొట్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, పార్కులు తదితర జన సామర్థ్య ప్రాంతాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు.
కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై చర్చలు
బీఆర్ఎస్ మాట ముచ్చటలో భాగంగా రెండేళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. కేసీఆర్ పాలనలో అమలైన స్కీంలు, కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఎత్తేసిన తీరును వివరించనున్నారు. బీఆర్ఎస్ హయంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిన తీరు, యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలు, తెచ్చిన పరిశ్రమలు, చేపట్టిన అభివృద్ధి పనులు, 24 గంటల నిరంతర కరెంట్, 20 వేల లీటర్ల ఉచిత మంచినీళ్ల స్కీం, కొనసాగించిన సంక్షేమ పథకాలపై విడమరిచి చెప్పనున్నారు. అలాగే గత 23 నెలల్లో నగరాభివృద్ధి కుంటుపడ్డ తీరు, కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల మధ్య చర్చ పెట్టనున్నారు.
కేసీఆర్ తెచ్చిన పథకాలను కాంగ్రెస్ ఎత్తేసిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా మైనారిటీలకు ఢోకా చేసిన వైనాన్ని ఎత్తిచూపనున్నారు. అలాగే మహిళలకు రూ. 2500, యువతులకు స్కూటీలు, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ల పెంపు, జాబ్ క్యాలెండర్, మైనారిటీ డిక్లరేషన్‌లోని హామీల విస్మరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట చేసిన మోసం.. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను జూబ్లీహిల్స్ ఎన్నికల క్షేత్రంలో ఎండగట్టనున్నారు.
గ్యారెంటీలు, హైడ్రానే ప్రధానస్త్రాలుగా..
మాట-ముచ్చటలో భాగంగా ఆరు గ్యారెంటీల విఫలం, హైడ్రాతో విధ్వంసం సాగించిన తీరును చౌరస్తాల్లో చర్చలు పెట్టాలని నిర్ణయించారు. ప్రజలతో నేరుగా మాట్లాడించి కాంగ్రెస్ పాలనలో ఎదురవుతున్న ఇక్కట్లను ఎకరువు పెట్టనున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. హైడ్రా ద్వారా పేదల ఇండ్లను కూల్చివేసిన వైనాన్ని వివరిస్తామని పేర్కొంటున్నారు. అలాగే ఈ ముసుగులో సాగిస్తున్న అక్రమ వ్యవహారాలను జూబ్లీహిల్స్ జనానికి వివరిస్తామని చెబుతున్నారు. ఏడాదిన్నర కిందట కాంగ్రెస్ గెలిచిన కంటోన్మెంట్లో ఆ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిన తీరు.. కేటాయించిన నిధులపై మాటతప్పిన తీరును ప్రజల ముందుంచుతామన్నారు.
ప్రజల్లోకి అధికారపార్టీ బెదిరింపు రాజకీయాలు
ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నేరచరిత్ర కలిగిన అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్ తీరును ప్రజలకు వివరించేందుకు మాటముచ్చట వేదికగా బట్టయలు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సమాయాత్తమయ్యారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఎదురయ్యే ఇబ్బందులు, చిరు వ్యాపారులు పడనున్న కష్టాలపై అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరిపించాలని జనానికి విజ్ఞప్తి చేయనున్నారు. నాలుగు లక్షల మంది ఇచ్చే తీర్పు తెలంగాణలో నాలుగుకోట్ల మంది భవిష్యత్‌ను నిర్ణయిస్తుందనే విషయాన్ని ప్రజలకు కుప్లంగా వివరించనున్నారు.
 
                            