సిటీబ్యూరో, మేడ్చల్/ అమీర్‌పేట/ మైలార్‌దేవ్‌పల్లి/ దుండిగల్/ కుత్బుల్లాపూర్/ జగద్గిరిగుట్ట/చార్మినార్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులను అంటగట్టి.. రూ.వేల కోట్లను దండుకునేందుకే కాంగ్రెస్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని నిరసిస్తూ బీఆర్ఎస్ నిజనిర్ధారణ బృందం కదం తొక్కింది. పారిశ్రామికవాడల్లో అడుగడుగునా కార్మికులు, చిన్న, పెద్దతరహాల రంగాల నిర్వాహకులతో ముచ్చటిస్తూ రేవంత్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా గురువారం జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో పని చేస్తున్న కార్మికులు, ఆయా కంపెనీల యజమానులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కార్మికులు కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని సూచించారు. హమాలీలతో మాట్లాడి పరిశ్రమలు తరలిపోతే వారికి ఎదురయ్యే సమస్యలను వివరించారు. ఇండ్లు, పాఠశాలలు, శ్మశానవాటికలు నిర్మించేందుకు స్థలం లేదంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 9292 ఎకరాల భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు అగ్గువకు కట్టబెడుతున్నదని విమర్శించారు.
5 లక్షల కోట్ల భూ కుంభకోణం
రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన హిల్ట్ పాలసీని నిరసిస్తూ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ నవీన్‌రావులతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ కలిసి సనత్‌నగర్ పారిశ్రామికవాడను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని 1.5 కోట్ల మందికి కనీస మౌలిక వసతులైన పాఠశాలల భవనాలు, అంగన్వాడీ భవనాలు, క్రీడా మైదానాలు, పార్కులు, ఆసుపత్రులు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు 9292 ఎకరాలను సిద్ధం చేస్తుండడం వెనుక రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. 87.31 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న సనత్‌నగర్ పారిశ్రామికవాడ రిజిస్ట్రేషన్ శాఖ విలువ రూ. 21 కోట్లు కాగా బహిరంగ మార్కెట్ ధర రూ. 45 కోట్లకు పై మాటేనన్నారు. హిల్ట్ పాలసీ ద్వారా ఈ భూములను రూ. 6.31 కోట్లకు మాత్రమే ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలను ప్రజలతో కలిసి ఎదుర్కొంటామన్నారు.

కార్మికుల పొట్టకొట్టేందుకే హిల్ట్ ..
లక్షలాది మంది పేద కార్మికుల పొట్ట కొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకువచ్చిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా రాష్ర్టాన్ని అమ్ముకోవచ్చో రేవంత్‌రెడ్డి చేసి చూపిస్తున్నారని విమర్శించారు. ఒక రైతు ముఖ్యమంత్రి అయితే రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేసి చూపించాలో కేసీఆర్ చేసి చూపించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ బృందం కాటేదాన్ పారిశ్రామికవాడలో పర్యటించింది. మండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కార్తిక్‌రెడ్డితో కలిసి ఆమె కాటేదాన్ పారిశ్రామికవాడలో కార్మికులతో మాట్లాడారు. అనంతరం చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు.
దూద్‌బౌలిలో పర్యటన
మాజీ హోం మంత్రి మహమూద్ అలీ దూద్‌బౌలిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో పలువురు సీనియర్ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో విధులు కొనసాగిస్తున్న శ్రామికులతో పాటు వ్యాపారస్తులతో పలు అంశాలపై చర్చించారు.

రేవంత్.. అవినీతి అనకొండ
హిల్ట్ పాలసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నది. ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి కాదు.. అవినీతి అనకొండ . గత ప్రభుత్వాలు పరిశ్రమలు నెలకొల్పి, ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు ఇచ్చిన భూములను రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నది.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ భూ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నాం.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కార్మికలోకాన్ని ఏకం చేస్తాం..
కార్మికులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పారిశ్రామిక భూములను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులను అప్పగించేందుకు పన్నాగం వేసింది. పారిశ్రామిక భూముల్లో రియల్ వ్యాపారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గం, సీఎం సోదరులు వాటాలుగా పంచుకోవాలనే నెపంతో హిల్ట్‌ను తీసుకొచ్చారు. రూ. 50 కోట్ల ధర ఉండే భూమిని రూ.1.5 కోట్లకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆసుపత్రులు, స్కూల్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఎకో పార్కుల కోసం కేటాయించాలే తప్ప.. రియల్ వ్యాపారం చేస్తానంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కార్మికలోకాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
విలువైన భూములను అన్యాక్రాంతం చేసేందుకే ..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం ఆరాటపడకుండా… రాష్ట్రంలో విలువైన భూములను అన్యాక్రాంతం చేసేందుకే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. పారిశ్రామిక భూములను ఇప్పటికే అగ్రిమెంట్లు చేసుకొన్నారు. దానిలో భాగంగానే హిల్ట్ జీవోను తెచ్చి..ఇక్కడి భూములను ప్రైవేట్‌కు అప్పగించేందుకు రేవంత్ సర్కార్ మూకుమ్మడిగా రియల్ వ్యాపారానికి తెరలేపింది.
– కేపీ వివేకానంద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
పేదలు రోడ్డున పడతారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు ఇక చెల్లవు. పారిశ్రామిక రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది కుటుంబాలు బతుకుతున్నారు. ఏండ్ల తరబడి ఇక్కడే ఉంటూ జీవనం పొందుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి క్రమంలో రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకొస్తున్న హిల్ట్‌తో ఎంతో మంది పేదలు రోడ్డున పడతారు.
– సత్యవతిరాథోడ్, మాజీ మంత్రి
లక్షల మంది కార్మికులు ఎక్కడికి పంపుతారు
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా కార్మిక వ్యతిరేకమే. హిల్ట్ పేరుతో కోట్ల రూపాయలను దండుకోవడానికి ఇక్కడి కార్మికుల పొట్టమీద కొట్టేందుకు పన్నాగం పన్నుతున్నది. ఇండస్ట్రీయల్‌లో పని చేస్తున్న లక్షలాది మంది కార్మికులను ఎక్కడికి పంపిస్తారు..? ప్యూచర్ సిటిపేరుతో కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
– శంభీపూర్‌రాజు, ఎమ్మెల్సీ
ఇన్సైడ్ ట్రేడింగ్ పాలసీ
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హిల్ట్ పాలసీ కాదు…ఇన్సైడ్ ట్రేడింగ్ పాలసీ. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేస్తున్న ఉద్యమానికి కార్మికులు, పరిశ్రమల యజమానులు సహకరించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో భూములను అమ్మడంపైనే దృష్టి పెట్టింది. కంచ గచ్చిబౌలి భూములను అమ్మేందుకు విఫలయత్నం చేసింది. ఇప్పుడు పరిశ్రమల భూములను అమ్మేందుకు కుట్రలు చేస్తున్నది.
– స్వామిగౌడ్, మండలి మాజీ చైర్మన్
సమస్యలు పరిష్కరించకుండా
ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే.. వాటిని పరిష్కరించకుండా కార్మికుల పొట్టను కొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా హిల్ట్ వంటివి తీసుకొచ్చి మాలాంటి వాళ్ల కడుపుకొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు దుర్మార్గమైన చర్య. ఎన్నో ఏండ్ల నుండి ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తూన్న తరుణంలో ప్రస్తుతం ఇక్కడి పరిశ్రమలను తరలించేందుకు చేస్తున్న కుట్రలను వెంటనే మానుకోవాలి.
– రాజాబాబు, ప్రైవేట్ ఎంప్లాయి
కాంగ్రెస్ తీరును మార్చుకోవాలి
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కార్మికులకు తీరని నష్టం తెస్తుంది. ఏండ్ల తరబడి పరిశ్రమలపై ఆధారపడి ఇక్కడే సదుపాయాలను, పిల్లలు స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుండి పరిశ్రమలు తరలిస్తున్న మా లాంటి కుటుంబాలు లక్షల్లో రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుంది.
– నర్సిరెడ్డి, ఎంప్లాయి, జీడిమెట్ల
ఇక్కడి సంపదను దోచుకొని ఢిల్లీ పెద్దలకు..
హిల్ట్‌ను తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద భూస్కాంకు పాల్పడుతున్నది. ఇక్కడి సంపదను దోచుకొని ఢిల్లీ పెద్దలకు బ్యాగులు పంపించేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఇలాంటి వ్యవహరాలను తిప్పికొట్టేందుకు ప్రజలను ఏకం చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు తిరుబాటు చేయాల్సిన అవసరం ఉంది.
– మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
