కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 17: రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా అఖండ విజయం సాధించటం తథ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపుకోసం ఎర్రగడ్డ డివిజన్లో పార్టీ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి సహా పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు శుక్రవారం ఇంటింటికీ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి ఇంటి ఆత్మబంధువయ్యారన్నారు. ఈ ఎన్నికల్లో సునీత ఎదురులేని గెలుపును సొంతం చేసుకుంటుందని ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగు గుణ పాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.