సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరసన గళం విప్పింది. ఏడాదిలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సమస్యలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, లింకు రోడ్లు, రవాణా ఆధారిత అభివృద్ధి తదితర ప్రాజెక్టులు చేపట్టి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దితే …అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను గాలికి వదిలేసిందని విమర్శించారు. వీధి దీపాల నిర్వహణ సరిగా లేదని, కొత్తగా వైకుంఠధామాలు, రోడ్డు కనెక్టివిటీ నిర్మాణాలు లేవని, పారిశుధ్యం పూర్తిగా గాడి తప్పిందన్నారు.
కొందరు అధికారులు కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని, ఫోన్లు బ్లాక్‌లో పెట్టడం, ఫోన్ ఎత్తకపోవడం, మరికొన్ని చోట్ల ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఏడాది పాటు సమయం ఇచ్చామని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బీఆర్ఎస్ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సమస్యలపై గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల బృందం గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి వినతిపత్రం సమర్పించింది. తలసాని నేతృత్వంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, వివేకానంద్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, మహమూద్ అలీ, శంభీపూర్ రాజు, కార్పొరేటర్ల బృందం కమిషనర్‌కు ప్రజా సమస్యలను వినతిపత్రం ద్వారా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రజల ప్రక్షాన నిరంతరం పోరాటం: ఎమ్మెల్యే తలసాని
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా అవసరాలను తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పన జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇచ్చినా అభివృద్ధి విషయంలో తమ వైఖరి మార్చుకోవడం లేదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఇక మీదట గ్రేటర్లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. నియోజకవర్గాల వారీగా పేరుకుపోయిన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని, కచ్చితంగా వాటిని పరిష్కారించాలని, పరిష్కరించకపోతే తగిన కారణాలు చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు.
అన్నింటి కంటే ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో శంకుస్థాపన చేసి.. 10 నుంచి 20శాతం పనులు జరిగితే వాటిని రద్దు చేశారని మండిపడ్డారు. ఫత్తేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణ, సనత్‌నగర్ ఇండ్రస్టీయల్ ఏరియాలో అండర్‌పాస్ తదితర చోట్ల పనులను నిలిపివేశారని తలసాని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ కచ్చితంగా పాటించాలన్నారు. సంఖ్యాపరంగా బలంగా ఉన్న బీఆర్ఎస్కు కౌన్సిల్లో ప్రశ్నలకు అవకాశం కల్పించకపోవడం సిగ్గుచేటని, కౌన్సిల్లో ప్రజా సమస్యలే ఎజెండా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఈ నెల 25న గ్రేటర్ బీఆర్ఎస్ నాయకులంతా ప్రత్యేక సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని తలసాని డిమాండ్ చేశారు.