సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మంగళవారం రాజధాని పరిధిలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కొన్ని ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.
సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వందల కిలోమీటర్ల పైప్లైన్లు, లిఫ్ట్ ఇరిగేషన్లు, 19 బరాజ్‌లు అని, అందులో మేడిగడ్డ ప్రాజెక్ట్‌లోని రెండు పిల్లర్లు కూలితే ప్రాజెక్ట్ మొత్తం కూలిందని విష ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నట్లు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ చేపడుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. కంటోన్మెంట్‌లోని అన్నానగర్ తెలంగాణ చౌక్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జేల నాగేశ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పీర్జాదిగూడలో మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు ధర్మరెడ్డి ఆధ్వర్యంలో డైరీ ఫాం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ యువనేత అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో షాబాద్‌లో శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా..
మేడ్చల్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, శామీర్‌పేట్, బొడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, కీసర తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. అంబేద్కర్ విగ్రహలకు వినతి పత్రాలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చూడాలని కోరారు. నిరసనల కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ మధుకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా పోలీస్స్టేషన్లకు తరలించారు.
బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా..
బండ్లగూడ: రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు ధర్మరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం డైరీ ఫాం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు ఆధ్వర్యంలో బండ్లగూడ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కక్ష సాధింపు కోసమే..
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట, సెప్టెంబర్ 2: మాజీ సీఎం కేసీఆర్‌పై కక్ష సాధింపు కోసమే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మంగళవారం బాలాపూర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లెలగూడలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. ఈ నిరసనలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.