సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ)/షాద్‌నగర్ : ఇబ్బడిముబ్బడిగా నేరాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల థర్డ్ డిగ్రీతో అనారోగ్యంతో షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న దళిత మహిళను సోమవారం ఆమె పరామర్శించారు. అండగా ఉంటామని అభయమిచ్చారు.
మహిళ అని కూడా చూడకుండా, పోలీసులు విచక్షణా రహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సీఎం అసెంబ్లీలో మహిళా సభ్యులను అవమానిస్తుంటే.. పోలీసులు కూడా అదే వైఖరి అవలంభిస్తూ మహిళను విచక్షణారహితంగా కొట్టారన్నారు.
సీఎం సోదరుల కాన్వాయ్‌కు రక్షణ కల్పించే పనిలో ఉన్న పోలీసులకు సామాన్యులు కన్పించడం లేదని ఎద్దేవా చేశారు. థర్డ్ డిగ్రీ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. థర్డ్ డిగ్రీకి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు సురభి వాణీదేవీ, నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ కరువైందని శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అభిప్రాయపడ్డారు. అనంతరం వారు బాధితురాలికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందజేశారు.