జూబ్లీహిల్స్ జోన్ బృందం, నవంబర్ 5 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా అన్ని డివిజన్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. బుధవారం నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్, పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను వివరించడంతో పాటు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను వివరిస్తూ ముందుకు సాగారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో బీఆర్ఎస్ శ్రేణులకు ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ ఓటు బీఆర్ఎస్ పార్టీకే వేస్తామంటూ, జూబ్లీహిల్స్‌లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని భరోసా ఇచ్చారు.
అమీర్‌పేట్, నవంబర్ 5 : కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తుందని, వారంటే సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ నేతలందరికి చిన్న చూపేనని, సీఎం నిర్వహిస్తున్న రోడ్‌షోలలో మైనారిటీలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నిరుపేద మైనారిటీల సంక్షేమానికి 200కు పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆడ పిల్లల వివాహాలకు షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక చేయూత, రంజాన్ పండుగకు పేద ముస్లింలకు తోఫాల పంపిణీ, రంజాన్ సామూహిక విందులు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుండే మైనారిటీలు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీలంతా ఏకపక్షంగా బీఆర్ఎస్కే మద్దతు తెలుపుతున్నారన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహ్మద్ గౌసుద్దీన్ తదితరులతో కలిసి విస్తృతంగా బుధవారం ప్రచారాన్ని నిర్వహించారు.
జూబ్లీహిల్స్, నవంబర్5: అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, ప్రజలను మరోసారి మభ్యపెట్టి జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మధురానగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో బుధవారం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేశారు. అనంతరం మధురానగర్ కాలనీలో దయన్న సైన్యం, స్థానిక నాయకత్వంతో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ప్రజలే మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ మాగంటి సునీతకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మధురానగర్ కాలనీ నాయకులు, పాలకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, నవంబర్ 5: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని షేక్‌పేట డివిజన్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత హామీలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెపుతారని ధీమా వ్యక్తం చేశారు.
కందుకూరు, నవంబర్ 5 : కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గండికోట యాదయ్య, గుర్రం ఈశ్వర్, గుర్రం రవీందర్, వరికుప్పల మహేశ్, దేవరశెట్టి మహిపాల్తోపాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ తిరుపతయ్య, పొన్న అంజయ్యలతో కలిసి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో బుధవారం చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలని కోరారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగడుగున నిలదీయాలని కోరారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డుపల్లి కాళీదాస్, బండారి బీరప్ప,అచ్చన భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.