తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటల కరెంట్ తరహాలో హైదరాబాద్ మహానగరంలో 24 గంటల మంచినీరు సరఫరా చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ముషీరాబాద్, అంబర్పేట్ నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌కు మద్దతుగా సోమవారం మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలతో నగరాభివృద్ధి ఆగిపోతుందని, నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వెంటనే హైదరాబాద్ జనాలు బరాబర్ ఉంటారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో నగరంలో ఎస్ఆర్డీపీ కింద మూడేండ్లలోనే 36 బ్రిడ్జిలను పూర్తి చేశామని, కేంద్రం చేపట్టిన అంబర్‌పేట, ఉప్పల్ బ్రిడ్జిలు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని ఆయన ప్రశ్నించారు.
అంబర్‌పేట వరకు మెట్రో రైలు తీసుకొస్తామని చెప్పిన ఆయన మూసీపై 14 బ్రిడ్జిలు మంజూరయ్యాయని, రెండేండ్లలో మూసీ సుందరీకరణ పూర్తి చేస్తామన్నారు. నగరానికి కేంద్రం నుంచి రూపాయి వరద సాయం తీసుకురాని కిషన్‌రెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతడన్నారు. అంబర్‌పేట, ముషీరాబాద్‌లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుసుడు ఖాయమనే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు పారిపోయారని ఎద్దేవా చేశారు. నిత్యం జనాల్లో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్‌లను మరోసారి గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): బరాబర్ హైదరాబాదీలు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వెంటే ఉంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించి.. బీఆర్ఎస్ అభ్యర్థులు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్‌ను గెలిపించాలని కోరారు. అంబర్‌పేట అలీ కేఫ్, ముషీరాబాద్‌లో రాంనగర్ చౌరస్తా, ముషీరాబాద్ సుప్రీం హోటల్ వద్ద జరిగిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నగరాభివృద్ధికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను మరోసారి గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో నగరంలో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే.. కేంద్రం నుంచి రూపాయి తీసుకురాని కిషన్‌రెడ్డి ఓట్లు అడుగుతున్నారని, డిసెంబర్ 3 తర్వాత రాహుల్‌గాంధీ కనిపించరని, కానీ సీఎం కేసీఆర్ నిత్యం జనాల్లో ఉంటారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏ ముఖంతో ఓట్లు అడుగుతున్నారు..
హైదరాబాద్‌లో వరదలు వస్తే..రూపాయి తీసుకురాని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..ఏ ముఖంతో ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నారో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అదే సమయంలో గుజరాత్‌కు వరదలు వస్తే రూ. 1000 కోట్లు తక్షణ సాయం కింద మోదీ ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని ఇక్కడి ప్రజలు గుర్తు పెట్టుకున్నారని చెప్పారు.
తెలంగాణ సర్కారు మూడేండ్లలో 36 వంతెనలను పూర్తి చేసిందని, కేంద్రం చేపట్టిన అంబర్‌పేట క్రాస్ రోడ్, ఉప్పల్ ఫ్లై ఓవర్లు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నత్తనడకన సాగుతున్న ఆ రెండు బ్రిడ్జిలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. నిత్యం జనాల్లో ఉండే కాలేరు వెంకటేశ్‌ను మరోసారి గెలిపించాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదిన్నరేండ్లు అయిందని, ఆరంభంలో ఎన్నో, మరెన్నో అవమానాలు, అంతకు మించిన అపోహాలతో సమైఖ్య పాలకులు, పార్టీలు లేనిపోని అబద్ధాలు చెప్పి జనాలను భయాందోళనలకు గురిచేశారన్నారు.
కానీ బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన అనతి కాలంలో పేదలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత 24 గంటల కరెంటు తరహాలో 24 గంటల మంచినీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ అన్నం పెట్టే అమ్మలాంటి హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కులమతాల వైషమ్యాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరం కలిసి మెలిసి నగరంలో ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నామన్నారు. సోదరభావంతో అన్ని మతాల సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవిస్తూ గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా నగరవాసులు నిలుస్తున్నారన్నారు.
మెరుగైన శాంతి, ప్రశాంతమైన జీవన విధానం అందించడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీల కోసం రూ. 1200 కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 400కే సిలిండర్, ప్రతి మహిళకు సౌభాగ్యలక్ష్మి కింద నెలకు రూ. 3వేలు, ఆసరా పింఛన్లు పెంచుకుంటామని స్పష్టం చేశారు. అంబర్‌పేటకు మెట్రో రైలు తీసుకువచ్చే బాధ్యత బీఆర్ఎస్దేనని, మూసీపై 14 బ్రిడ్జిలను మంజూరు చేయడంతో పాటు, మూసీ సుందరీకరణ రెండేండ్లలోనే పూర్తి చేస్తామని చెప్పారు.
బరాబర్ బీఆర్ఎస్ వెంటే..
అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ వెంటే హైదరాబాద్ జనాలు బరాబర్ ఉంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు మద్దతుగా రాంనగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ముఠా గోపాల్‌ను మరోసారి గెలిపించాలన్నారు.
నగరానికి వచ్చిన ప్రధాని మోదీ… హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ముఠా గోపాల్‌ను గెలిపిస్తే ముషీరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని, ఇందిరా పార్కు సుందరీకరణ, ఫౌంటెయిన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు మద్దతుగా సుప్రీం హోటల్ వద్ద రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే మంచి నీరు వస్తున్నదని, రోడ్లు బాగుపడ్డాయని, ప్రజలు శాంతియుతంగా జీవనం గడుపుతున్నారని చెప్పారు.