KTR | మేడ్చల్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ‘మహిళా సోదరిమణులు ఎదురు చూస్తున్నారు.. మహాలక్ష్మి పథకం ఎప్పుడా అని…2500 ఎప్పుడు వస్తాయని.. గ్యారంటీ కార్డులు ఎక్కడా అని…వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేసి తీరాలి.. లేదంటే ఆ తర్వాత బొంద తవ్వడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శనివారం కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సీఎం, డీప్యూటీ సీఎంలు సంతకాలు చేశారన్నారు. మార్చి 17 వరకు ఓపికగా ఉంటామని, వంద రోజులు పూర్తయిన తర్వాత ప్రజల పక్షాన పోరాడుతామని కేటీఆర్ హెచ్చరించారు.
దేశంలోనే తలసరి ఆదాయంలో నంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్ది కాంగ్రెస్‌కు బంగారు పల్లాన్ని అప్ప చెప్పామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లంకె బిందెలు లేవు.. ఖాళీ కుండలే అని మాట్లాడడం ఆ స్థాయికి తగదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే సమర్థత లేక ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మార్చి 17 తర్వాత సమాధానం చెబుతామని హెచ్చరించారు.
పార్లమెంట్లో కాంగ్రెస్ వస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. దివాలకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. గ్రేటర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిపించిన ఉత్సాహంతోనే వచ్చే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ విజ్ఞాప్తి చేశారు. సన్నాహక సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మల్లారెడ్డి హెల్త్‌సిటీ చైర్మన్ భద్రారెడ్డి పాల్గొన్నారు.
కరెంట్ పోతున్నది.. నీళ్లు సక్కగా వస్తాలేవు.. ముసలోళ్లకు పింఛన్ కూడా సక్కగా వస్తలేదు.. ఇప్పుడంతా గోసకే వచ్చింది…ఆగమాగమైంది.. ఇప్పుడే కేసీఆర్ రావాలె.. ఇప్పుడున్న ముఖ్యమంత్రి వద్దు’ అని కుత్బుల్లాపూర్‌కు చెందిన లక్ష్మమ్మ తన ఆవేదనను వ్యక్తపరిచారు. దీంతో ఆమెను కేటీఆర్ వేదికపైకి పిలుపించి మాట్లాడించారు. ఇప్పుడే కేసీఆర్ రావాలె.. ఇప్పుడున్న ముఖ్యమంత్రి వద్దు అని చెబితే.. ఇప్పుడు ఏం చేయలేమని ఐదేండ్ల వరకు ఆగాలని కేటీఆర్ సర్ది చెప్పారు.