మూసీ నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వంతెన కూడా పూర్తి చేయలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు నిదర్శనంగా మారాయన్నారు. మూసీ నదిపై బ్రిడ్జిల నిర్మాణంలో కాంగ్రెస్ అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఎక్స్ వేదికగా ఎండగట్టారు. మూసీ నదిపై వంతెనల నిర్మాణం హైదరాబాద్ వాసుల చిరకాల కల అని, ఆ కలను నిజం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 545 కోట్లు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించిందని కేటీఆర్ గుర్తు చేశారు.
మూసీ నదిపై వంతెనల నిర్మాణం ద్వారా హైదరాబాద్ వాసుల రాకపోకలను సులభతరం చేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం జనవరి 2022లో రూ. 545 కోట్లతో 15 వంతెనల నిర్మాణానికి సంకల్పించిందన్నారు. ఈ వంతెనల పొడవు సుమారు 150-200 మీటర్లు ఉంటుందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు.