తొమ్మిదేండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి.. మరోమారు ఆశీర్వదిస్తే.. బంగారు తునకగా మార్చుకుందాం
“బీజేపీ నాయకులేమో మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే.. కాంగ్రెస్ నాయకులేమో కరెంటు వద్దు, రైతు బంధు వద్దు అంటున్నారు.. వాళ్ల మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు ఆగం కావద్దు” అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. “తెలంగాణ రాకముందు వలసలు పోవుడు.. బతుక పోవుడు. చెట్టుకొకలు.. పుట్టకొకలు ఆగమాగం అయినం. ఇయ్యాళ కాపాడుకోవాలి.. నిలబెట్టుకోవాలని ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కాల్వలకు నీళ్లు ఇచ్చినం. నీళ్లకు ట్యాక్స్ రద్దు చేసినం. పాత బకాయిలు మాఫీ చేసినం. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నం. ఎంత కరెంటు వాడుతున్నవ్.. ఎన్ని మోటార్లు పెడుతున్నవ్ అని అడుగొద్దు.. రైతులను ఇబ్బంది పెట్టొద్దని కరెంటోళ్లకు చెప్పినం. రైతుబంధు ఇస్తున్నాం.. రైతు బీమా ఇస్తున్నాం.
ఏ ఊరి పంటను ఆ ఊరిలోనే కొంటున్నాం. రైతాంగాన్ని నిలబెట్టుకోవాలి. వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే పద్ధతితో ముందుకుపోతున్నం. మూడుకోట్ల మందికి కంటి పరీక్షలు చేసి.. 80 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినం.. ఈ పని చరిత్రలో ఏ ప్రభుత్వమైనా చేసిందా..? వైద్య, విద్య, వ్యవసాయం ఏ రంగమైనా కావచ్చు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. అనేక సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వృత్తుల వాళ్లను ఆదుకుంటున్నాం. తెలంగాణ రాకముందు మన గతి ఎట్లుండే.. ఇప్పుడెట్లుంది. ఓటేసే ముందు ఏ ప్రభుత్వం ఏర్పడితే మంచిదో ఆలోచన చేయాలి. కామారెడ్డికి కేసీఆర్ ఒక్కడు రాడు.. కేసీఆర్ వెంబడి చాలా వస్తయి. కామారెడ్డిని బంగారు తునకలా తయారు చేసి మీకు అప్పగిస్తా.. అందుకు మీ సహకారం కావాలి. అని కేసీఆర్ అన్నారు.
ధరణి రాకముందు రైతుల భూమి రిజిస్టర్ చేయాలంటే వీఆర్వో, గిర్దావరి, తాసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, ఆయన మీద సెక్రటరీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి ఉండేటోళ్లు. ఇండ్ల ఎవరికి కోపం వచ్చినా.. కైలాసంలో ఆటల పెద్దపాము మింగినట్టే.. భూమి గోవిందా.. ఎల్లయ్య భూమి పుల్లయ్యకు.. పుల్లయ్య భూమి ఎల్లయ్యకు రాసి.. జుట్లు ముడేసి.. తాకట్లు పెట్టి.. ఆఫీసుల చుట్టు తింపి.. వేలు, లక్షలు గుంజిండ్రు. రైతులను నాశనం పట్టిచ్చిండ్రు. వీరి ఆగడాలకు చెక్ పెట్టేందుకే ధరణి పోర్టల్ తెచ్చినం. ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాలను రైతుల బొటనవేలుకు అప్పగించినం. భూ యాజమాన్యం మారాలంటే.. రైతు బొటనవేలుతోనే సాధ్యం. అలాంటి ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతు బీమా ఎట్ల వస్తది..? వడ్లు కొన్న పైసలు ఎట్ల వస్తయి.. పాత గిర్దావరిలు, వీఆర్వోలు వస్తరు. మళ్లా రైతుల పరిస్థితి మొదటికి వస్తది. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని అనేటోళ్లను బంగాళాఖాతంలో వేయాలి.
“రాహుల్‌గాంధీకి ఎద్దెరుకనా..? ఎవుసం ఎరుకనా..? ఏనాడైనా నాగలి పట్టిండా..? వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి, తెలంగాణలో రాజకీయ అస్థిరత తేవాలని ఎవడైతే ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి 50 లక్షల నగదుతో పట్టుబడ్డడో.. ఆ మహాత్ముడే కామారెడ్డిల నామీద పోటీకొస్తడంట.. కామారెడ్డి ప్రజలు ఆలోచన చేయాలి. రైతు బంధు, రైతు బీమా, ధరణి, 24 గంటల కరెంటు వద్దు అనేటోళ్లు కావాల్నా.. ప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసేటోళ్లు కావాల్నా..?”
“కాంగ్రెస్ పార్టీ తెలంగాణకోసం ఏం చేసింది.? ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు గోసపెట్టింది. వందలాది మంది విద్యార్థుల చావులకు, కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా..? వారి పాలనలో ప్రాజెక్టులు కట్టిండ్రా..? నీళ్లు ఇచ్చిండ్రా..? ఉద్యోగాలు ఇచ్చిండ్రా..? కరెంటు ఇచ్చిండ్రా..? ఆ పార్టీకి ప్రజల ఓట్లు కావాలే. కానీ ప్రజల బాగోగులు పట్టవు. అందుకే గుడ్డిగా ఓటెయ్యొద్దని కోరుతున్నా. ఆలోచించి ప్రజల బాగుకోరే పార్టీకి ఓటేస్తే వచ్చే ఐదేళ్లు మేలు జరుగుతది.” అని సీఎం కేసీఆర్ అన్నారు.