BRS Party | వనస్థలిపురం, మార్చి 20 : ఎల్బీనగర్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అంటకాగుతున్నారని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్‌రెడ్డి, జివి సాగర్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, పద్మానాయక్లు అన్నారు. గురువారం వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక నీచ రాజకీయాలకు దిగుతున్నారన్నారు. కాంగ్రెన్ నేత మధుయాష్కి సలహాలతో బీజేపీ కార్పొరేటర్లు పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గానికి వస్తున్న 80 శాతం నిధులు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మంజూరు చేయించినవే అన్నారు. జీహెచ్ఎంసీ, హుడాల నుంచి తీసుకురావడం జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ నిధులతో పనులు చేస్తున్నామని కార్పొరేటర్లు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారని, ఇక్కడి ప్రజలే ఆయనను గెలిపించారన్నారు.
ఎన్జీవోస్ కాలనీలోని లైబ్రరీ గ్రౌండ్‌ను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చూస్తుంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి మధుయాష్కి చుట్టూ తిరుగుతున్నాడని విమర్శించారు. చంపాపేట కార్పొరేటర్ ఓ ఫంక్షన్ హాల్ కోసం మధుయాష్కి ఇంటి చుట్టూ తిరిగాడన్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు కార్పొరేటర్లు అందరూ కలిసి వస్తున్నారని, ముగ్గురు మాత్రం కావాలనే రాజకీయం చేస్తూ, ప్రారంభమైన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. అభివృద్ధికోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యేపై బురదజల్లేందుకు కుట్రలు చేయడం తగదన్నారు. ఇన్చార్జి మంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తారని ఎన్నో పనులు ఆపారని, బీజేపీతో గెలిచిన ఈ సన్నాసులు ప్రశ్నించకుండా కాంగ్రెస్‌కు వంతపాడుతున్నారన్నారు. మన్సూరాబాద్ డివిజన్లో హెచ్ఎండీఏ నుంచి మంజూరైన రూ.5కోట్ల నిధుల పనుల ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ కూడా హాజరయ్యాడన్నారు. పలు కార్యాక్రమాలలో కార్పొరేటర్లు పాల్గొన్న ఫోటోలను ప్రదర్శించారు. కావాలనే ప్రోటోకాల్ వివాదాన్ని తీసుకువస్తున్నారని, తీరు మారకుంటే ప్రజా క్షేత్రంలో భంగపాటు తప్పదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెరుకు ప్రశాంత్‌గౌడ్, రమావత్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.