జీవించినంత కాలం మాగంటి గోపీనాథ్ ప్రజా నాయకుడిగా పనిచేశారని, పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని సభ్యులు కొనియాడారు. శనివారం జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాగంటి గోపీనాథ్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
కలిసి పనిచేశాం
– ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు తెలుగు యువతలో చేరి యువకులు పార్టీ కోసం పనిచేశాం. ఎన్టీఆర్‌తో పాటే వివిధ రాష్ర్టాల పర్యటనలు చేశాం. తొలుత నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. తర్వాత మాగంటి గోపీనాథ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించా. నాకు అత్యంత దగ్గరి మిత్రుడు. వరుసగా మూడుసార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. ప్రజలే ఆయనను గెలిపించుకున్నారు.
క్రమ శిక్షణ కలిగిన నేత
– ఎమ్మెల్యే వివేకానంద్
జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చాలా క్రమ శిక్షణ కలిగిన నేత.1983 నుంచి 2014 వరకు ఓపికతో ఎదురుచూసి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికై.. వరుసగా మూడు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వయసులో ఆయన పెద్దవారైనా.. నన్ను సోదరుడిగా, స్నేహితుడిలాగా చూసుకునేవారు. స్నేహానికి విలువ ఇచ్చేవారు. హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలను పరిషరించడంలో జట్టుగా పని చేశాం. సొంత ఖర్చుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నమ్ముకున్న వారికి, కార్యకర్తలకు, అభిమానులకు అండగా ఉన్నారు.
పట్టుబట్టలు పెట్టేవారు
– ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
మాగంటి గోపీనాథ్ ప్రజలతో మమేకమయ్యేవారు. ఇందుకోసం సొంత డబ్బులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పట్టుబట్టలు పెట్టి భోజనాలు పెట్టేవారు. రాష్ట్రంలో 18 నెలల్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు. ఎమ్మెల్యేలకు సర్కారు హెల్త్ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలి.
సినిమాలు నిర్మించారు
– ఎమ్మెల్యే ముఠా గోపాల్
ప్రజాసేవతో పాటు మాగంటి గోపీనాథ్ సినిమాలు కూడా తీశారు. కానీ, అందులో సక్సెస్ కాలేకపోయారు. కానీ, అనేక మందిని ప్రోత్సహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు గెలవడమంటే కత్తిమీద సాములాంటింది. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తున్నా.