గోల్నాక, జూన్ 1 : అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదేశించారు. బుధవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో అంబర్పేట సర్కిల్ పౌరసరఫరాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల రేషన్ కార్డుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. గత మార్చి నెలలో కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ పురోగతి లేదన్నారు. అర్హత ఉన్నా కార్డులు పొందలేకపోతున్నామని అనేక మంది లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు కూడా ముఖ్యమైన గుర్తింపుగా ఉపయోపడే రేషన్ కార్డుల పంపిణీని వేగవంతం చేయాలన్నారు. ఈ విషయంలో మరింత శ్రద్ధ వహించి, పారదర్శకత, సమర్థతతో కొత్త కార్డులు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీలో జరుగుతున్న ఆలస్యం పేదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. పారదర్శకంగా విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా కొత్త కార్డులు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అంబర్ పేట సర్కిల్ అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి దీప్తితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.