వెంగళరావునగర్, నవంబర్ 1: బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల్ని నిలదీయాలని మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సబితా ఇంద్రారెడ్డి శ్రీనగర్ కాలనీలోని సెలూన్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో 200 యూనిట్ల వరకూ సెలూన్లకు ఫ్రీ కరెంట్ ఇచ్చామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఉచిత విద్యుత్ తొలగించారని దీంతో క్షౌరవృత్తి పై ఆధారపడ్డ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అడబిడ్డకు ఇస్తానన్న రూ.2500, మహిళలకు స్కూటీలు ఏవని ఆమె ప్రశ్నించారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌లో ఇస్తామన్న తులం బంగారం హామీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని ఓట్ల కోసం వచ్చే కాంగ్రెసోళ్లను నిలదీయాలని కోరారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతమ్మకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అప్పుడు కేసీఆర్ కరెంట్ ఫ్రీగా ఇచ్చిండు..
అమీర్‌పేట్, నవంబర్ 1: గిరాకి బాగా తగ్గింది, కరెంట్ బిల్లులు పెరిగినవి, చేతికింద పనోల్లకు కూడా జీతాలు ఇయ్యలేని పరిస్థితి అంటూ ఎర్రగడ్డలోని లుక్ హెయిర్ సెలూన్ నిర్వాహకులు అశోక్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హెయిర్ సెలూన్ల సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు. ఇది ఒక అశోక్ పరిస్థితి మాత్రమే కాదని, తెలంగాణలోని దాదాపు అన్ని హెయిర్ సెలూన్ల పరిస్థితి ఇదే విధంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీహరి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎర్రగడ్డలోని హెయిర్ సెలూన్లను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్ కొనసాగించిన పాలనలో క్షౌరశాలలకు ఉచిత విద్యుత్ అందజేసి వారి ఉపాధికి ఊతమిస్తే, ఇప్పుడు రేవంత్ సర్కార్ అప్పటి ఉచితాలను తొలగించి బడుగుల ఉపాధిపై బలవంతంగా బిల్లులను రుద్దుతున్నారన్నారు.బడుగుల ఓటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పడితేనే వారికి బుద్ధి వస్తుందన్నారు
కేసీఆర్ హయాంలో విద్యుత్, తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేదు
జూబ్లీహిల్స్, నవంబర్ 1 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో విద్యుత్, తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని.. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలు తప్పడంలేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. యూసుఫ్‌గూడ బస్తీలోని అపార్ట్మెంట్లను శనివారం బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గృహిణులతో మాట్లాడినప్పుడు కేసీఆర్ పాలనలోనే విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేదని.. నల్లా ద్వారా ప్రతిరోజూ సమయానికి.. సమృద్ధిగా నీటి సరఫరా జరిగేదని చెప్పారు. దివంగత మాగంటి గోపీనాథ్ పేదలకు ఎప్పుడూ అండగా ఉండేవారని.. మూడు వేలమందికి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు ఏర్పాటు చేశారని వారు గుర్తుచేసుకున్నారు.
నాయీ బ్రాహ్మణులపై భారం మోపిన
బంజారాహిల్స్, నవంబర్ 1: కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి చేయూత నిచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ తొలగించడం దారుణమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన ‘మాట-ముచ్చట’ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం హెయిర్ కటింగ్ సెలూన్స్ సందర్శించి నాయీ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న కష్టాలపై అడిగి తెలుసుకున్నారు. వెంగళరావునగర్ డివిజన్లో హెయిర్ కటింగ్ సెలూన్‌ను ఆయన సందర్శించారు. కారు గుర్తుకే ఓటేసి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రహ్మత్‌నగర్‌లో..
రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సెలూన్‌కు వెళ్లి షేవింగ్ చేయించుకుని నాయీ బ్రాహ్మణుడితో మాట్లాడారు. ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పలు ప్రాంతాల్లోని హెయిర్ కటింగ్ సెలూన్లను సందర్శించారు.
ముదిరాజ్‌ల మద్దతు సునీతమ్మకే
షేక్‌పేట్‌లో ముదిరాజ్ సంఘం నాయకులతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలి వైస్ చైర్మన్ బండాప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్,బీఆర్ఎస్ నాయకులు ముఠాజయసింహ,విష్ణువర్ధన్ రెడ్డి, చెరక మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల మద్దతు బీఆర్ఎస్కే
షేక్‌పేట్ నవంబర్ 1: కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని ప్రజలు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని జూబ్లీహిల్స్‌లో అన్ని వర్గాల మద్దతు బీఆర్ఎస్కే ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం షేక్‌పేట్ డివిజన్ సూర్యనగర్ కాలనీలో నాయీబ్రాహ్మణులతో మాటాముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు.
జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం
కాప్రా, నవంబరు 1: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రతి ఓటరును కలుస్తూ బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మాట-ముచ్చట కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్‌కాలనీలో సెలూన్షాప్లో నాయీ బ్రాహ్మణుడిని కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ జె.ప్రభుదాస్, బీఆర్ఎస్ నాయకులు సాయిరాం, నరేష్, శేఖర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో కులవృత్తులకు మొండి చెయ్యి
అల్లాపూర్, నవంబర్1: కాంగ్రెస్ పాలనలో కులవృత్తులకు మొండి చెయ్యి చూపిస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానందగౌడ్ విమర్శించారు. బోరబండ డివిజన్ సైట్-3 లో శనివారం ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే వివేకానంద మాట-ముచ్చట కార్యక్రమంలో భాగంగా సెలూన్ షాపులను సందర్శించారు. సీఎం కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన 250 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగవేసిందని, ఏకంగా రూ.32 వేల విద్యుత్ బిల్లులు ఇచ్చారని సెలూన్ నిర్వాహకుడు తమ గోడు వెల్లిబుచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించాలని, తద్వారా ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని అన్నారు.