అన్నం ఉడికిందనేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ హస్తం పార్టీ భవితవ్యం ఆ ఒక్క మెతుకుతోనే తేలిపోయింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అందునా తొలి సభలో అధికార దుర్వినియోగంతో పాటు వరాల జల్లు కురిపించినా పట్టెడు మంది జాడ లేక షో అట్టర్ ఫ్లాప్ కావడంతో కాంగ్రెస్ దిమ్మతిరిగింది. అధికారంలో ఉన్నాం కదా ఓట్లు అవే రాలతాయనే భ్రమ వీడిపోయి వాస్తవం బోధపడింది. అందుకే సీఎం రేవంత్ సభ నుంచి వెళ్లిపోయిన వెంటనే రాత్రికి రాత్రి కొందరు ముఖ్యులతో సమావేశమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎక్కడ తేడా కొడుతుందంటూ ఆరా తీయగా ప్రజాక్షేత్రంలో జరగాల్సిన నష్టం జరిగిందని ఫీడ్‌బ్యాక్ వచ్చినట్లు సమాచారం. దీనికి తోడు ఓ మంత్రికి చెందిన మీడియాతో చేయించిన సర్వేల్లోనూ బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యత తేలిన విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురీదడం తప్ప ఎన్నిక ముఖచిత్రాన్ని తమ వైపు మలుచుకొనే అవకాశాలేవీ లేవని ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు.. నష్ట నివారణలో భాగంగా ‘అజారుద్దీన్‌కు మంత్రి పదవి’ గాలం వేశారే తప్ప మైనార్టీలపై చిత్తశుద్ధి కాదనేది తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు స్పష్టం తచేస్తున్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : అధికారం అండతో ఎలాగైనా జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకుందామని కాంగ్రెస్ పెద్దలు భావించారు. వేలల్లో ఉండే సినీ కార్మికులు తమ వైపే ఉన్నారని భ్రమపడ్డారు. అది నమ్మించేందుకు మొన్న నిర్వహించిన సీఎం సన్మాన సభ అట్టర్ ఫ్లాప్ అయితే గానీ తత్వం బోధపడలేదు. రెండేళ్ల పాలనా వైఫల్యం, రౌడీషీటర్‌ను బరిలో దింపడం, అటు సర్వేల్లోనూ బీఆర్ఎస్కు కాంగ్రెస్ కంటే ఎక్కువ ఆధిక్యం వంటి అంశాలు.. కాంగ్రెస్‌ను షాక్‌కు గురిశాయి. ఇలా ఎటుచూసినా కాంగ్రెస్‌కు ఎదురీత తప్పదని భావించి.. మైనార్టీలపై చిత్తశుద్ధి లేకున్నా వారి ఓట్ల కోసం ‘అజారుద్దీన్‌కు మంత్రి పదవి’తో గాలం వేయాలని చూస్తున్నది.
ప్రజాక్షేత్రంలో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత మునుపెన్నడూ చూడలేదని రాజకీయ ఉద్దండులు అభిప్రాయపడుతున్నారు. అందునా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా హైదరాబాద్ మహానగరంలో గులాబీ జెండాను రెపరెపలాడించిన బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం అనేది నల్లేరు మీద నడకేననిది అనేక సర్వేలు మొదలు సామాన్యుడి దాకా చెబుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని జూబ్లీహిల్స్ సీటును చేజిక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ అనుసరిస్తున్న విధానాలు నియోజకవర్గ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత 22 నెలల్లో హైదరాబాద్‌కి తట్టెడు మట్టి పని చేయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. మాగంటి గోపీనాథ్ మరణంతో ఒక్కసారిగా శిలాఫలకాల జాతరకు తెరతీసింది.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏనాడూ జూబ్లీహిల్స్ వైపు కన్నెత్తి చూడని ప్రభుత్వ పెద్దలు శిలాఫలకాలతో హడావిడి చేశారు. సుమారు రూ.100కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామంటూ పలు ప్రాంతాల్లో శిలాఫలకాలు వేశారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లను తవ్వేసి ఎన్నికల కోడ్ వచ్చిందంటూ పనులు నిలిపివేశారు. అభివృద్ధి పేరుతో ఊదరగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ప్రారంభంలోనే బెడిసికొట్టాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా నగరంలోనే పేరుమోసిన రౌడీషీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకైన నవీన్యాదవ్ను ప్రకటించడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అగ్గికి ఆజ్యం పోసినట్టు నవీన్ తన నామినేషన్ దాఖలు సమయంలో ఇతర ప్రాంతాల నుంచి సైతం రౌడీషీటర్లను రంగంలోకి దింపడంతో అభ్యర్థి ఆలోచనా తీరుపై ప్రజల్లో విస్తృతంగా చర్చ మొదలైంది. ఒకవైపు పదేండ్ల కేసీఆర్ పాలనలోని అభివృద్ధి.. మరోవైపు రెండేళ్ల కాంగ్రెస్ వైఫల్యాలు.. వీటికి తోడు ప్రజల్లో ప్రధాన ఎజెండా మారిన ‘రౌడీషీటర్లు.. నేరచరితులు’ వంటివి క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులను ఇప్పటికే మంత్రులు, ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గుర్తించారు. అందుకే మునుపటి ఉత్సాహం కాంగ్రెస్ నేతల ప్రచారంలో సన్నగిల్లిందనేది జూబ్లీహిల్స్ కాంగ్రెస్ శ్రేణులే బహిరంగంగా చెబుతున్నాయి.
భ్రమలు పోయి.. ‘బొమ్మ’ కనిపించింది!
తెలుగు సినీ పరిశ్రమలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ కుటుంబానికి మంచి పట్టు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి తోడు చిత్రపురికాలనీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు వల్లభనేని అనిల్ లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో సుమారు 24వేల దాకా ఉన్న సినీ కార్మికుల మద్దతు తమకుందని చెప్పుకొనేందుకు సీఎం అభినందన సభ పేరిట వేలాది మందిని పోగు చేసి బల ప్రదర్శన చేపట్టాలని రేవంత్ వర్గం భావించింది. కానీ క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో బతిమిలాడినా, బెదిరించినా చివరకు డబ్బులు ఖర్చు చేసినా రెండు రోజుల కిందట సీఎం సన్మాన సభ అట్టర్ ఫ్లాప్ షోగా మారి సినీ కార్మికుల్లో నవీన్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉందనే భ్రమల్ని పటాపంచలు చేసింది.
ఈ పరిణామాన్ని ఏమాత్రం ఊహించని సీఎం రేవంత్‌రెడ్డి సభ ముగిసిన వెంటనే హుటాహుటిన సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. రాత్రికి రాత్రి ఒకరిద్దరు మంత్రులతో పాటు కొందరు ప్రముఖుల్ని పిలిపించుకొని షో ఫ్లాప్ కావడం వెనుక కారణాల్ని ఆరా తీసినట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అభ్యర్థి కుటుంబంపై ఉన్న రౌడీషీటర్ ముద్ర ప్రజల మనసుల్లో నాటుకుపోయినందున కాంగ్రెస్‌కు ప్రతికూల పవనాలు బలంగా వీస్తున్నాయని సదరు ప్రముఖులు కుండబద్దలు కొట్టారు. అయితే ఇదేదో రాత్రికి రాత్రి ఏర్పడిన పరిస్థితులు కావని, మంత్రుల పర్యటనలు, బూత్ సమావేశాల్లోనూ వీటి తాలూకు ఛాయలు కనిపించాయని వివరించడంతో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడేం చేయగలం? అని పార్టీ పెద్దలు తెల్లమొహం వేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
తేడా కొడుతున్న మైనార్టీ ఓటు బ్యాంకు
సన్మాన సభ అట్టర్ ఫ్లాప్ తర్వాత సీఎం నిర్వహించిన సమీక్షలో ఇటీవలి సర్వేల ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా ఓ మంత్రికి సంబంధించిన మీడియా కొన్నిరోజులుగా నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ కంటే ఏకంగా ఎనిమిది శాతం స్పష్టమైన ఆధిక్యత ఉన్నట్లుగా తేలిందనే చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో మైనార్టీ ఓటు బ్యాంకులో కాంగ్రెస్‌కు భారీగా గండి పడుతుందనే సంకేతాలు కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. అండగా నిలుస్తుందనుకున్న మజ్లిస్ నుంచి ఆశించిన మద్దతు రావడం లేదని పార్టీ నేతలు కొందరు చెప్పినట్లు తెలిసింది.
మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్కరోజు ప్రచారం చేసి, బీహార్ ప్రచారానికి వెళ్లిపోవడంపైనా సుదీర్ఘంగా చర్చించారు. పరోక్షంగా అసద్ హ్యాండిచ్చిన క్రమంలో మైనార్టీ ఓటు బ్యాంకు గండిని కొంతయినా పూడ్చుకొనేందుకు ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే తప్పని పరిస్థితుల్లో ఇన్నాళ్లూ అవమానాలకు గురి చేసి, పక్కకు తప్పించిన అజారుద్దీన్‌కు మంత్రి పదవిని ఎరగా వేయాలనే నిర్ణయానికొచ్చారని స్పష్టమవుతున్నది. దీంతో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను ఇన్చార్జులుగా రంగంలోకి దింపి ప్రలోభాలకు తెరతీయాలనే ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తున్నది.