KTR | రేవంత్‌రెడ్డి పంపే హైడ్రా బుల్డోజర్లకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అడ్డుగా నిలబడతారని, హైదరాబాద్ నగరంలో పేదలకు బీఆర్ఎస్ రక్షణ కవచంలా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైడ్రా, మూసీ ప్రాజెక్టు బాధితులకు భరోసా నింపేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ భవన్లో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇందులోభాగంగానే మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ బస్సు యాత్ర చేపట్టనున్నది. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి హైడ్రా బాధితుల పరామర్శలు మొదలుకానున్నాయి.
సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అనాలోచిత నిర్ణయాలతో పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రణాళిక, ఆలోచన లేకుండా ప్రభుత్వమే అలా అనుమతులు ఇచ్చి..ఇలా అక్రమమంటూ హైడ్రా పేరిట హైడ్రామాలు చేస్తూ వందలాది కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నది. మూసీ, హైడ్రా ప్రాజెక్టు విషయంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తు న్నారు. ప్రభుత్వ విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది.
ఈ వారంలో మూసీ పరీవాహక ప్రాంతంలో కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల బృందంతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ భరోసా యాత్రలో నోటీసులు అంటించిన ఇండ్లలో కలియతిరిగి వారిలో ధైర్యాన్ని నింపనున్నారు. మూసీ పేరిట ప్రభుత్వం ఏ విధంగా లూటీ చేస్తుందో? అమాయక ప్రజల జీవితాలతో ఎలా చెలగాటం ఆడుతుందో వివరించనున్నారు. మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లను ఖర్చు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందో ప్రశ్నించనున్నారు.
గరీబోళ్లకు అన్యాయం జరుగుతుందంటే ఆ ప్రాజెక్టు వద్దని కేసీఆర్ ప్రభుత్వం మానవీయ ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నారని, ఒక్క పేదవాడి కడుపు కొట్టకుండా సుందరీకరణ చేపట్టిన సంగతిని ప్రజలకు వివరించనున్నారు. తొలుత కూకట్పల్లి నియోజకవర్గంలో కేటీఆర్‌తో కూడిన ఎమ్మెల్యేల బృందం పర్యటించి హైడ్రా బాధితులను పరామర్శించనున్నది. హైడ్రా అధికారులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజలను కబ్జాదారులు అంటున్న విధానాన్ని ఎండగట్టనున్నారు. మొత్తంగా హైదరాబాద్ ప్రజలకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ నాయకులంతా కలిసికట్టుగా కదిలేందుకు సిద్ధమయ్యారు.