బంజారాహిల్స్,అక్టోబర్ 21:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాగోపీనాథ్కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తుండగా రెండోవైపున అధికార పార్టీ నేతల్లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు గ్రూపులు కడుతూ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా రహ్మత్‌నగర్ డివిజన్లో కార్పొరేటర్ సీఎన్.రెడ్డి వర్గానికి, పార్టీ ఇంచార్జిగా పనిచేస్తున్న మాదాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నేత నగేష్ నాయక్‌కు మద్యన వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ వాగ్వాదం కాస్తా మాజీ కార్పొరేటర్ భవానీ శంకర్ వర్గం, సీఎన్‌రెడ్డి వర్గం నేతల మద్యన బాహాబాహీకి దారి తీసింది. మంత్రి వివేక్‌తో పాటు అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం ముగిసిన తర్వాత ఎస్పీఆర్ హిల్స్‌లోని రాజీవ్‌గాంధీనగర్ బస్తీలో ఓ నాయకుడి ఇంటివద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. కాగా సీఎన్.రెడ్డి వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తల స్పందన సరిగాలేదని, ప్రచారానికి సమయపాలన పాటించడం లేదంటూ నగేష్ నాయక్ తదితరులు ఫిర్యాదులు చేశారంటూ సీఎన్.రెడ్డి వర్గానికి చెందిన ప్రధాన అనుచరుడు ఎత్తరి అంతయ్య తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేస్తుంటే తమమీదనే ఫిర్యాదులు చేస్తారంటూ ఎత్తరి అంతయ్య తదితరులు నగేష్ నాయక్ మీదకు వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ నేతలమీదకు ఎలా వెళ్తారంటూ అక్కడే ఉన్న మాజీ కార్పొరేటర్ భవానీశంకర్ వర్గానికి చెందిన కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకోవడంతో పాటు తోపులాటకు దిగారు. సుమారు 20నిమిషాల పాటు గొడవ అనంతరం స్థానిక నేతలు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.