మణికొండ, నవంబర్ 28 : మాయమాటలు చెప్పి బడుగుబలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లల్ల్లో తీరని అన్యాయం చేస్తున్నదని, అధికార పార్టీని గ్రామపంచాయతీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలంతా సమాయత్తం కావాలని మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17శాతం రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నెక్నాంపూర్ ప్రభుత్వ పాఠశాల నుంచి పంచవటికాలనీ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీతారాం దూళిపాళ మాట్లాడుతూ అసాధ్యం కానీ హామీలతో ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిన రేవంత్ సర్కారు ఏ ఒక్క హామీనీ అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి చివరకు 17శాతం రిజర్వేషన్లతో బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 420 హామీల కాంగ్రెస్ సర్కారు బడుగులను నట్టేట ముంచడంతో పాటు ఒక్క సంక్షేమ పథకం అమలు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు.
రైతు బంధు, బీమా, మహాలక్ష్మి, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఫించన్లు ఎందుకు పెంచలేదని ప్రజలంతా ప్రశ్నించాలన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు హాయాంలో 24శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే అవి సరిపోవంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చి కేవలం 17శాతమే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్తుండటంపై ప్రజల ఆలోచించాలన్నారు. గద్దెనెక్కేంత వరకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేయడం ఆ తర్వాత గద్దెనెక్కి గతాన్ని మరవడం కాంగ్రెస్ సర్కారు తీరు అని ఆనాడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. మరోసారి స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోవద్దంటూ ఆయన హితవు పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామంటూ గంటాపథంగా చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదో ప్రజలే ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గుట్టమీది నరేందర్, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కుంబగళ్ల ధన్‌రాజ్, యువజన విభాగం అధ్యక్షుడు సంగం శ్రీకాంత్, నాయకులు బుద్దోలు బాబు,కిరణ్, విఠల్, మల్లేష్, భానుచందర్, సుమనళిని, మాల్యాద్రి నాయుడు, నరేష్, సంతోష్,ప్రవీణ్, తిరుపతి, శ్రీనివాస్‌చారి, షాంలెట్ రేఖ, బిందు పాల్గొన్నారు.