‘మూసీలో పేదల కన్నీళ్లు పారుతున్నాయి.. పేకమేడల్లా కూల్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న పన్నాగాలతో గుండెలు కరిగిపోతున్నాయి.. ఆర్తనాదాలు, ఆక్రందనలను చేస్తున్నా.. బండ లాంటి గుండె కలిగిన రేవంత్‌రెడ్డి మాత్రం కనికరం చూపడం లేదు.. అని మాజీ మంత్రి హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది’ అని అభయమిచ్చారు. ‘మీ ఇండ్లపై బుల్డోజర్లు రావాలంటే… ముందు మమ్మల్ని దాటుకుని పోయేలా.. బీఆర్ఎస్ రక్షణ కవచంలా నిలబడుతుంది’ అని ధైర్యం చెప్పారు. ఆదివారం హైదర్షాకోట్, లంగర్‌హౌస్ సమీపంలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. బాధితుల గోడు విన్న హరీశ్‌రావు..‘మీ బాధ చూస్తుంటే కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. మీ బాధలు వింటే.. రాతి గుండె కూడా కరిగిపోవాల్సిందే. కానీ రేవంత్ గుండె ఎందుకు కరగడం లేదో నాకైతే అర్థం కావడం లేదు’.. అని అన్నారు.
– సిటీబ్యూరో/మైలార్‌దేవ్‌పల్లి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ)
రేవంత్.. ముందు నీ ఇంటిని కూలగొట్టు
గుండెలు బాదుకుంటున్న వినకుండా బుల్డోజర్లతో ఇండ్లు కూల్చివేస్తున్న రేవంత్‌రెడ్డి… సొంతిల్లు కూడా చెరువు భూములోనే ఉందని హరీశ్‌రావు అన్నారు. కొడంగల్‌లోని రెడ్డికుంటలో ఉందని, దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో రేవంత్ సోదరుడి సొంతిల్లు కూడా ఉన్నదని, ముందుగా ఆ రెండింటిని కూల్చివేసి, ఆ తర్వాత పేదల ఇండ్లపైకి రావాలన్నారు. అధికారం ఉందని సోదరుడికో రూల్, పేదలకో రూల్ పాటించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఐదేండ్లు పాలించమని అధికారం అప్పగిస్తే… పేదలకు జీవితకాలం పాటు ఉండే ఇండ్లను సీఎం రేవంత్‌రెడ్డి కూల్చివేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ తలుపులు తెరిచే ఉంటాయి
‘మీకు ఇబ్బంది వస్తే 24 గంటలు తెరిచి ఉండే తెలంగాణ భవన్‌కు రావాలి..అర్ధరాత్రి వచ్చినా.. ఆశ్రయమిస్తాం..అత్యవసరమైతే ఫోన్ చేయాలి..అరగంటలో గులాబీ దండు మీ ముందు ఉంటుంది’.. అని బాధితులకు హరీశ్‌రావు అభయమిచ్చారు. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు పైసలు లేవంటున్న రేవంత్ రెడ్డి… మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. నగరాన్ని వరదలు ముంచెత్తినా… నిజాం రాజు కూడా వరదలు వచ్చినట్లుగా ఇండ్లు కూలగొట్టలేదని, కానీ రేవంత్ వరదల పేరిట దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. మూసీ సుందరీకరణ మానుకొని.. బాధితులకు రేవంత్ భరోసా ఇవ్వాలని సూచించారు. ‘మీ ఇండ్లపైకి దూసుకువచ్చే బుల్డోజర్లకు అడ్డుగా తన కొడుకు కార్తిక్‌రెడ్డిని నిలబెడతానం’టూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధితులకు ధైర్యం చెప్పారు.
హైదర్షాకోట్, లంగర్‌హౌస్ సమీపంలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, గంగుల కమలాకర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. పేదల బతుకులను చిధిమేస్తున్న కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని తెలిసి సుమారు 5వేల మంది బాధితులు తరలివచ్చారు. తమ గూడును కూల్చేస్తామంటున్న రేవంత్ సర్కార్‌ను నిలువరించాలని వేడుకున్నారు. నిర్వాసితులకు ధైర్యం చెప్పి..అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ప్రభుత్వం దిగివచ్చేవరకు బాధితుల పక్షాన నిలబడుతామని స్పష్టం చేశారు. హైదర్షాకోట్, లంగర్‌హౌస్ సమీపంలో ఉన్న పలు కాలనీవాసులతో మాట్లాడిన హరీశ్‌రావు.. ఇందిరమ్మ పాలనలో పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వాల్సింది పోయి… పేదల ఇండ్లను కూల్చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘మీరు అధైర్యపడొద్దు, ప్రాణాలు తీసుకోవద్దు. తెలంగాణలో ఇందిరమ్మ పాలన పోయి… బుల్డోజర్ల రాజ్యం నడుస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీగా తరలి వచ్చిన జనం..
మూసీ నిర్వాసితుల పక్షాన బీఆర్ఎస్ నిలుస్తూ చేపట్టిన సంఘీభావ పర్యటనలో తమ సొంతింటిని కోల్పోతున్న వేలాది మంది జనాలు తరలి వచ్చారు. బిక్కుబిక్కుమంటూ హైడ్రా భయంతో బతుకీడుస్తున్నామని.. గుండెలు బాదుకుంటూ తమ ఆవేదనను బీఆర్ఎస్ శ్రేణులకు తెలిపారు. బీఆర్ఎస్ పేదల పక్షాన నిలిస్తుందని..నిర్వాసితులకు న్యాయస్థానాల ద్వారానైనా న్యాయం జరిగేలా చూస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
మా స్నేహాన్ని విడదీయవద్దు
నా స్నేహితురాలు హైదర్షాకోట్ ప్రాంతంలో ఉంటుంది. కొన్ని రోజులుగా ఆమె స్కూల్‌కు రావడం లేదు. ఏమైందని ఆమెను అడిగితే మొన్న మా ఇంటికి పోలీసులు, అధికారులు వచ్చారు.. మా ఇంటిని కూల్చి వేస్తామని చెబుతున్నారు. ఇంటిని ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని బలవంతం చేయడంతో మమ్మి, డాడీ ఏమి చేయాలో తెలియక ఇంట్లో ఏడుస్తూ ఉండిపోతున్నారు. మా ఇంటిని కూల్చేస్తే మేము ఇక్కడ ఉండం.. ఇతర ప్రాంతానికి వెళ్లిపోతాం అని రోదిస్తున్నది. మూసీ పరీవాహక ప్రాంతం నుంచి కాకుండా అధికారులు కావాలనే మార్కింగ్‌ను తప్పుగా చేస్తున్నారు. సీఎం సార్ మా స్నేహితురాలి ఇంటిని కూలిస్తే తను స్కూల్‌కు రాదు. ఇతర ప్రాంతానికి వెళ్లిపోతుంది. మా స్నేహాన్ని వీడదీయవద్దు సారూ.
– రోహిణి, ఆరో తరగతి, హైదర్షాకోట్
సీఎం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
సీఎం అంటే ప్రజలకు మంచి చేయాలని చూస్తారు.. కానీ ఇలా ఇబ్బందులు పెట్టాలని చూసే సీఎంను ఇప్పటి వరకు చూడలేదు. డెవలప్మెంట్ అనే పేరును చూపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదు. మేము నివసించే ఇండ్లు బఫర్ జోన్లో ఉంటే ఏ విధంగా పన్నులు కట్టించుకున్నారో మాకు చెప్పాలి. ఇన్ని రోజులు లేని అన్యాయం ఇప్పుడే ఎలా జరుగుతుంది. మేము ఈ ప్రాంతంలో తీసుకున్న ప్రతి దస్తావేజు మా వద్ద ఉన్నాయి. ఎలా ఇవి అక్రమ నిర్మాణాలవుతాయో అధికారులే సమాధానం చెప్పాలి.
– కృష్ణ, గంధంగూడ, కె.కె.నగర్, ఫేస్-2
ప్రజల గోడు వినేదెవరూ?
మార్కింగ్ చేసే సమయంలో మేము చెప్పే ఏ ఒక్క విషయాన్ని కూడా అధికారులు వినిపించుకోవడం లేదు. కేవలం వారు ఏదో చెబుతున్నారు.. వెళ్లిపోతున్నారు తప్ప.. ప్రజలు ఏదో చెప్పాలనుకుంటున్నారు వారి సమస్య ఏమిటిని అని వినే నాథుడే కరవయ్యారు. వారు ఏదీ చేసినా.. చెల్లుతుందని అనుకుంటున్నారు. కానీ వారి ఆగడాలను సాగనివ్వం. ఎంత మంది వచ్చినా వారిని ప్రతిఘటించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడుతాం తప్ప..మా ఇండ్లను వదులుకునే ప్రసక్తే లేదు.
– శ్రీనివాస్, విఘ్నేశ్వర కాలనీ.
ఇన్నాళ్లూ ఎలా బిల్లు కట్టించుకున్నారు..
మేము ఆక్రమించుకున్న స్థలం బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో ఉంటే ఏ విధంగా కరెంటు, నల్లా బిల్లు వస్తుంది. పన్నులు ఏ విధంగా కట్టించుకున్నారు. ఏ విధంగా మా ఇంటికి పర్మిషన్ ఇచ్చారు. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇన్ని సంవత్సరాలుగా మేము ఉంటూ ప్రభుత్వానికి అన్ని విధాలా బిల్లులు చెల్లిస్తున్నాం. మా వద్ద అన్ని దస్తావేజులు భద్రంగా ఉన్నాయి. ప్రభుత్వమే కదా మేము చెల్లించిన బిల్లులకు రసీదులు ఇచ్చింది. మాది తప్పు అయినప్పుడు ప్రభుత్వ అధికారులు మాకు ఇవన్నీ ఎలా ఇచ్చారు. అలాంటప్పుడు ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలి.. పేద ప్రజలపై కాదు.
– రఘునాథ్ తివారీ, కె.కె.నగర్ కాలనీ, హైదర్షాకోట్.
పైసా పైసా కూడబెట్టి ..
మూసీ ఎక్కడో ఉంది.. మా ఇండ్లు మరెక్కడో ఉన్నాయి.. మేము ఏదో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రూపాయి రూపాయి కూడబెట్టుకొని స్థలాన్ని కొనుగోలు చేశాం. అలాగే డబ్బులు జమ చేసుకొని ఇంటిని నిర్మించుకున్నాం. అధికారులు వచ్చి మీ ఇండ్లు అక్రమ నిర్మాణమని చెబుతుంటే గుండెలు ఆగిపోయే పరిస్థితి వస్తున్నది.
– బిందు, హైదర్షాకోట్.
వెళ్లం..ఇక్కడే ఉంటాం..
అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటే వీటిని కూలగొట్టి మమ్మల్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఏదో పని చేసుకుంటూ మా పిల్లలను ఇక్కడ చదివించుకుంటూ సిటీని నమ్ముకొని బతుకుతున్నాము. సదుపాయాలు లేని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే మేము ఎందుకు పోతాము. కష్టపడి నిర్మించుకున్న ఇంట్లోనే ఉంటాం.
– శిరీష, విఘ్నేశ్వర కాలనీ.
కష్టపడి ఇల్లు కట్టుకున్నాం..
జీవిత కాలం కష్టపడితే కానీ మా ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు. అలాంటి ఒక రాత్రిలో ఇది అక్రమ నిర్మాణం, బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్పడం సరికాదు. సీఎం పదవి అంటే ఐదేండ్లకు ఒకసారి మారుతుంది. కానీ మేము నివసించే ఇల్లు మా ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదు.
– తేజస్వినీ కె.కె.నగర్.