బంజారాహిల్స్, జూలై 20: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబసభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా అనంద్తో పాటు పలువురు కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 18న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో జరిగిన బహిరంగసభలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారని అన్నారు. బావిలో దూకి చావు.. పెట్రోల్ పోసుకుని చావు.. మీ కుటుంబసభ్యులు కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోండి.. అంటూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజ్యాంగబద్దమైన సీఎం పదవిలో ఉంటూ ప్రతిపక్ష నేతను ఆత్మహత్య చేసుకోవాలంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి మీద వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించి న్యాయసలహా అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా తమ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకపోవడంపై సుమిత్రా అనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలపై ఎలాంటి ఆధారాలు లేకున్నా కేసులు పెట్టే పోలీసులు సీఎం రేవంత్రెడ్డి మీద ఫిర్యాదు చేస్తే కేసు ఎందుకు పెట్టరంటూ ప్రశ్నించారు.