షేక్‌పేట్ నవంబర్ 4:ప్రజల అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన కృషిని కొనసాగించడానికి తనకు అవకాశం కల్పించాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ కోరారు. మంగళవారం షేక్‌పేట్ డివిజన్లోని బృందావన్ కాలనీ, మినీ బృందావన్ కాలనీ, హకీంషా కాలనీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్, మాజీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ తదితరులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
షేక్‌పేట్ డివిజన్లోని బీజేఆర్నగర్, అంబేద్కర్‌నగర్, సబ్జా కాలనీ, విరాట్‌నగర్, హకీంషా కాలనీ, మినీ బృందావన్ కాలనీలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌నగర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్, హెచ్వైసీ సల్మాన్ ఖాన్, నాయకులు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

