బంజారాహిల్స్, సెప్టెంబర్ 21: ‘బతికి ఉన్నంత కాలం గోపన్న మాకు అండగా నిలిచారు..’ ‘ఆయన ఆకస్మికంగా మరణించడంతో కష్టాల్లో ఉన్న గోపన్న కుటుంబానికి మేము అండగా నిలుస్తాం.. ’ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు,నేతలతో పాటు వారి కుటుంబసభ్యులు భరోసా ఇస్తున్నారు. ఆదివారం యూసుఫ్‌గూడ డివిజన్లోని పలు బస్తీల్లో పర్యటించిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తె మాగంటి అక్షర ఆయా ప్రాంతాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తల ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో తమకున్న ఆనుబంధాన్ని గుర్తుచేసుకున్న కార్యకర్తలు, నేతలు కన్నీళ్లపర్యంతమయ్యారు. ఏ కష్టమొచ్చినా గోపన్నకు చెప్పుకొనేవారిమని, ఆయన మరణం తర్వాత పెద్ద దిక్కు కోల్పోయినట్లయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన మాగంటి అక్షర మాట్లాడుతూ… నాన్న ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కష్టమైనా.. సుఖమైనా జనంలోనే అంటూ నాన్న ఎప్పుడూ చెప్పేవారని.. ఆయన మాట ప్రకారమే కుటుంబం మొత్తం ప్రజల్లోకి వచ్చి … మద్దతు కోరుతున్నామన్నారు.
కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించేవారు..
జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 21: మాగంటి గోపినాథ్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించేవారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్ పేర్కొన్నారు. ఆదివారం యూసుఫ్‌గూడ డివిజన్ ఎల్ఎన్ నగర్లో కుమార్తె మాగంటి అక్షరతో కలిసి పర్యటించి కాలనీవాసుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు అమ్మాజీ నివాసంలో మహిళలతో కలిసి వంటలు చేసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, దేదీప్యరావు, డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.