కంటోన్మెంట్, సెప్టెంబర్ 10 : నూతన బిల్డింగ్ బైలాస్ చట్టం అమల్లో భాగంగా 133 గజాల స్థలం నుంచి 10 శాతం మార్టిగేజ్ (తనఖా) విధానం ఇకపై కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పేద ప్రజలకు శాపంగా మారనున్నది. మార్టిగేజ్ చట్టం అమలు విధానంపై బీజేపీకి చెందిన బోర్డు నామినేటేడ్ సభ్యురాలు భానుక నర్మద, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఇరువురు బోర్డు అధికారుల నిర్ణయాన్ని వెంటనే సమర్థించడంతో మార్టిగేజ్ విధానానికి ఆమోదం లభించింది.
ఈ విషయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తమ పార్టీకి చెందిన నామినేటేడ్ సభ్యురాలు తప్పిదాన్ని సరిదిద్దాడానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బోర్టు అధికారులను కలిసి మార్టిగేజ్ విధానం రద్దు చేయాలని కోరారు. ఈ ఏడాది మే 23న జరిగిన బోర్డు పాలక మండలి సమావేశంలో బిల్డింగ్ బైలాస్ నూతన విధానం అమల్లో భాగంగా బ్రిగేడియర్, కంటోన్మెంట్ సీఈవో మార్టిగేజ్ విధానం ప్రవేశపెట్టారు.
ఈ విధానం అమలుపై చర్చ జరిగిన సందర్భంలో నర్మద కూలంకషంగా తెలుసుకుని వ్యతిరేకిస్తే మార్టిగేజ్(తనఖా) విధానం అమల్లోకి వచ్చేది కాదు. అందులో కొన్ని మార్పులు జరిగే వీలుండేది. కానీ అధికారుల నిర్ణయానికి ఎమ్మెల్యే, నామినేటెడ్ సభ్యురాలు అంగీకరించడంతో 125 గజాల నుంచి 200 గజాల స్థలం ఉన్న పేదల్లో వ్యతిరేకత మొదలైంది.
హైకోర్టులో పిటిషన్ వేసిన క్రిషాంక్..
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మార్టిగేజ్ విధానం అమలుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, బీజేపీ నామినేటేడ్ సభ్యురాలు భానుక నర్మద సమర్థించడంతో గత జూన్ నుంచి బోర్డు పరిధిలో మార్టిగేజ్ విధానం ద్వారా భవనాల నిర్మాణాలకు అనుమతులు లభిస్తుండడంతో పలువురు పేద, మధ్యతరగతి ప్రజలు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ దృష్టికి తీసుకెళ్లారు.
జీహెచ్ఎంసీలో 200 చ.మీ నుంచి మార్టిగేజ్ విధానం అమలు చేస్తుంటే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నూతనంగా ప్రవేశపెట్టిన 111 చదరపు మీటర్ల అమలు విధానాన్ని వ్యతిరేకిస్తూ క్రిషాంక్ హైకోర్టును ఆశ్రయించారు. కంటోన్మెంట్ ప్రజలు ఇంటిని కట్టుకోవాలనే కలను బోర్డు అధికారులు మార్టిగేజ్ విధానంలో ఇబ్బందులు కలిగిస్తున్నారని క్రిషాంక్ తరపున న్యాయవాది ముకిబ్ హైకోర్టులో వాదించారు. ఈ సందర్భంగా వారంలోగా కంటోన్మెంట్ బోర్డు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.