Jubilee Hills By Elections | హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి షేక్‌పేట డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పారామౌంట్ కాలనీలో ఆటో యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాకప్పి జీవన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారందరూ తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని ప్రకటించారు. అనంతరం ఆకీమ్షా కాలనీలో మైనారిటీ సోదరులతో, రిలయన్స్ జూబ్లీ అసోసియేషన్ సభ్యులతో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో రాష్ట్రంలోని ప్రతివర్గాన్ని ఆదుకున్నామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆరు గ్యారంటీలు వంటి హామీలను గాలికొదిలేసి, ఈ రెండు సంవత్సరాల కాలంలోనే ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ సాత్ దియా- రేవంత్ రెడ్డి ధోఖా కియా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదోళ్ల ఇండ్లు కూలగొట్టుడు తప్ప కాంగ్రెస్ చేసిందేమి లేదని విమర్శించారు. ఎన్నికల తరువాత మీ ఇండ్లకు కారు రావాల్నా-బుల్డోజర్ రావాల్నా మీ చేతుల్లో ఉందని స్పష్టం చేశారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 12,000 చొప్పున రెండు సంవత్సరాలకు రూ. 24,000 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కోసం మీ ఇండ్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులు చూపించి నిలదీయాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని స్పష్టం చేశారు.