వెంగళరావునగర్, మే 29: కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలకు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు (BRS Leader) బలయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టిన అధికార పార్టీ కార్పొరేటర్ బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడి ఇంటిని కూల్చేయించాడు. మనస్థాపానికి గురైన బాధితుడు తన మూడంతస్తుల ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు, స్థానికులు అర్ధరాత్రి హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. బాధితులు కథనం ప్రకారం బోరబండ ఎస్ఆర్టీ నగర్‌కు చెందిన బీఆర్ఎస్ మైనారిటీ విభాగం నాయకుడు, మెడికల్ షాపు నిర్వాహకుడు మొహ్మద్ సర్ధార్ (35) బస్తీలో తన ఇంటిని నిర్మించుకుంటుండగా కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బెదిరింపులకు దిగాడు. డబ్బు ఇవ్వకుంటే.. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి నీ ఇంటిని కూల్చివేయిస్తానని ధమ్కీ ఇచ్చాడు. ఇటీవల బల్దియా సిబ్బంది చేరుకుని ఆ ఇంటి స్లాబ్, గోడలకు రంధ్రాలు చేసి ధ్వంసం చేశారు. కష్టపడి సంపాదించి అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నప్పటికీ భార్యాబిడ్డలకు ఇప్పుడు ఇల్లు లేకుండా పోయిందన్న దిగులు చెందేవాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు సర్ధార్ బుధవారం రాత్రి తన ఇంటి మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనతో జనం రగిలిపోయారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో బోరబండ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ దౌర్జన్యాన్ని..అరాచకాల్ని నిరసిస్తూ అర్ధరాత్రి మృతుడి బంథువులు, స్థానికులు గుమిగూడి బోరబండ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు.
అంతులేని అరాచకాలు, దౌర్జన్యాలు సాగిస్తున్న అధికార పార్టీ కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ కు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ ప్రాణాలు బలిగొన్నాడని ఆరోపించారు. మామూళ్ళ కోసం కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులు తీవ్రతరమయ్యాయని వాపోయారు. తక్షణమే కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ ను అరెస్ట్ చేయాలని.. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని ఆందోళన చేశారు. పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబా ఫసియుద్దీన్ వేధింపులు భరించలేక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆత్మహత్య
కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ టార్చర్ తట్టుకోలేక నేను చనిపోతున్నా అని లేఖ రాసి సూసైడ్ చేసుకున్న బోరబండ డివిజన్ బీఆర్ఎస్… pic.twitter.com/j2a9cFajE9
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2025