KTR | రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేష్ ముదిరాజ్, ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయని గుర్తుచేశారు. 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 కే భోజనం, పింఛన్లు, రంజాన్ తోఫాతో పాటు అనేక పథకాలు అమలు చేశామని తెలిపారు. పేదలను కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని అన్నారు. షేక్‌పేటలో పెద్ద ఫ్లైఓవర్‌ను నిర్మించామని తెలిపారు. జీహెచ్ఎంసీలో, హైదరాబాద్‌లో ప్రతి ఎన్నికలోనూ ప్రజలు బీఆర్ఎస్కు ఓటేశారని ఆయన వివరించారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, రైతులు, మహిళలు అందరిని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
“మేం మోసపోయాం.. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోవద్దు. అరచేతిలో స్వర్గం చూపిస్తే ఊళ్లలో కొందరు మోసపోయారు. అందుకే గ్రామాల నుంచి రైతులు, ప్రజలు వచ్చి జూబ్లీహిల్స్‌కు వచ్చి ప్రచారం చేస్తామని చెబుతున్నారు” అని కేటీఆర్ అన్నారు. మేనిఫెస్టోను రాజకీయ పార్టీలకు పవిత్ర గ్రంథంగా భావించకుండా, కేవలం గ్యారెంటీ కార్డులు అని ఇంటింటికి పంచారని కేటీఆర్ విమర్శించారు. “18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు రూ. 2500 ఇస్తామని చెప్పారు. యువతులకు స్కూటీలు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాం అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షనే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. రెండేళ్లలో రేవంత్ ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక కొత్త పునాది లేదు. తెల్లారి లేస్తే మైకు పట్టుకొని కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు” అని ధ్వజమెత్తారు. “ఏదైనా అడిగితే ఫ్రీ బస్సు ఇచ్చాం కదా అని చెబుతున్నారు. ఆడవాళ్లకు ఫ్రీ ఇస్తున్నారు.. మగవాళ్లకు డబుల్ రేటు పెట్టారు. కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇంటికి వస్తే బాకీ కార్డు చూపించి ప్రజలు హామీ గురించి ప్రశ్నించాలి” అని కేటీఆర్ కోరారు.
ఒక్కొక్క మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇప్పటి వరకు రూ.60 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.48 వేలు, రైతులకు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని కేటీఆర్ లెక్కలు చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు, దళితులకు కాంట్రాక్టుల్లో వాటా ఇస్తామన్నారని.. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఏ వర్గాన్ని వారు వదల్లేదని విమర్శించారు. రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెడతానని ముస్లింలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే చిన్న షాక్ ఇవ్వాల్సిందే.. లేదంటే వాళ్లు దారికి రారని వ్యాఖ్యానించారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మేం ఏం చేయకపోయినా.. మోసం చేసినా మాకే ఓటేస్తున్నారని వాళ్లు భావిస్తారని.. ఇన్ని రకాలుగా మోసం చేసినా.. మళ్లీ మాకే ఓటేస్తున్నారంటే మేమే కరెక్ట్ అని వాళ్లు అనుకుంటారని కేటీఆర్ హెచ్చరించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణలోని గరీబోళ్లు, కార్మికులు, రైతులు అందరూ జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారని, జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. వచ్చే నెల 11న జరిగే పోలింగ్‌లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆయన కోరారు.”మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని కాపాడుకుందాం” అని ఆయన పిలుపునిచ్చారు.