సిటీబ్యూరో: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో ఈ నెల 11న సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 10 వేల మందితో ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. సికింద్రాబాద్ ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బతీస్తామంటే చూస్తూ సహించబోమని హెచ్చరించారు. 220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని విస్మరిస్తుందని ఆరోపించారు. జంట నగరాలు అంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలు ప్రసిద్ధి పొందాయన్నారు.
సికింద్రాబాద్ చరిత్రను, అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని తలసాని మండిపడ్డారు. సికింద్రాబాద్ పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. తమ ఆందోళన కార్యక్రమంలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, కలిసొచ్చే రాజకీయ పార్టీలు, కాలనీలు, బస్తీల కమిటీలు, కార్మిక, వ్యాపార, వాణిజ్య సంఘాలు ప్రతి ఒకరినీ కలుపుకుపోతామని వివరించారు.
సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధించే వరకు దశల వారిగా అహింసా మార్గంలో అనేక పోరాటాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో లషర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, రాంగోపాల్ పేట డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.