సిటీబ్యూరో, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ స్థాపించి విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం గ్రేటర్లోని ప్రతి కాలనీ, గల్లీలోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. పలు కూడళ్ల వద్ద పార్టీ జెండాలను ఆవిషరించి.. బాణాసంచా కాల్చి..సంబురాలు చేసుకున్నారు. పలు దవాఖానాల్లో పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి.. శ్రేణులు తమ సేవా గుణాన్ని చాటుకున్నారు.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిషరించి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రేటర్లో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటంలో బీఆర్ఎస్ పాత్ర చిరస్మరణీయమని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పోరాటంలో పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Hyd1