సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల కదన రంగంలో బీఆర్ఎస్ సత్తా చాటుతున్నది. విపక్ష పార్టీలకు దిమ్మతిరిగే వ్యూహాలతో ప్రచారంలో దూసుకుపోతున్నది. అభ్యర్థుల ఎంపికలోనూ తలమునకలవుతున్న విపక్ష పార్టీలు, ప్రకటించిన కొన్ని స్థానాల్లోనే భగ్గుమంటున్న నేతలను సర్దిచెప్పుకోలేక ఎన్నికల క్షేత్రంలో ప్రజాదరణకు దూరంగా ఉన్న పరిస్థితి. అధికార పార్టీ మాత్రం ఆగస్టు 21వ తేదీనే అభ్యర్థులను ప్రకటించడం, అన్ని పార్టీల కంటే ముందుగానూ అభ్యర్థులకు బీ-ఫాంల అందజేత, పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసి తనదైనశైలిలో ప్రచారంలో ముందు వరుసలో ఉన్నది. అంతేకాకుండా వచ్చే 45 రోజుల పాటు ప్రజల్లో ఉండటం, భారీ మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అస్త్రశస్ర్తాలతో కదనరంగంలోకి అభ్యర్థులను రంగంలోకి దింపింది.
అభ్యర్థులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి దిగడం, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, బీఫామ్స్ నింపే విషయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ అభ్యర్థులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. అంతా తమకే తెలుసు అన్నట్లు ప్రవర్తించొద్దంటూ చెప్పారు. హడావుడిలో బీఫామ్స్ తప్పుగా నింపొద్దని, ఆ తరువాత టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని అలర్ట్ చేశారు. పార్టీకి సంబంధించి న్యాయ కోవిదులు ఉన్నారని, సమస్యలుంటే వారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నిక, ఎన్నికకు కొత్త నిబంధనలు వస్తున్నాయని, పార్టీకి అందుబాటులో ఉన్న న్యాయవాదులను సంప్రదించి అవసరమైన సాయం తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ గడిచిన పదేండ్లలో చేసిన అభివృద్ధి, పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించాలని అభ్యర్థులకు సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి విషయంపై అభ్యర్థులు క్లారిటీతో ఉండాలన్నారు.
45 రోజుల పాటు.. పకడ్బందీ వ్యూహాలు
పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచించిన విధంగా రెట్టింపు ఉత్సాహంతో 45 రోజులపాటు ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జలవిహార్‌లో పార్టీ జిల్లా బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలు, పార్టీ ముఖ్య నేతలతో 45 రోజుల ప్రణాళికలకు సంబంధించి బాధ్యతలు అప్పగిస్తారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించారు. డివిజన్‌కు రెండు పార్టీ కార్యాలయాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన వార్‌రూం కేంద్రం ర్యాలీలు, బహిరంగ సభలకు సంబంధించిన ముందస్తు అనుమతులు, అభ్యర్థుల ప్రచారం, నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం, రోజువారీ ప్రచార శైలి, ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనే ప్లాన్ తదితర అంశాలను రోజూవారీ నివేదిక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అందజేయడం లాంటి వాటితో భారీ మెజార్టీతో గెలిచేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
గ్రేటర్ అభ్యరులకు నేడు బీ ఫామ్‌లు
తెలంగాణ భవన్లో 51 మందికి బీ-ఫామ్‌లను అందజేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మిగిలినవి సోమవారం ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు సంబంధించిన పార్టీ అభ్యర్థులు సోమవారం అందుకోనున్నారు. పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేసుకోవడం, భారీ మెజార్టీ లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పార్టీ మ్యానిఫెస్టోతోపాటు నియోజకవర్గ ప్రగతిని కరపత్రంగా ముద్రించి కండ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజల మద్దతుతో గులాబీ జెండాను మరోసారి ఎగరేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.