వెంగళరావునగర్, అక్టోబర్ 13 : మాగంటి అంటేనే జనం.. జూబ్లీహిల్స్ నియోజవర్గాన్ని తన కుటుంబమని తన భర్త మాగంటి గోపీనాథ్ ఎప్పుడూ చెప్తుండేవారని.. ఆయన సతీమణి,బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం రహ్మత్ నగర్ డివిజన్ లోని శివమ్మ పాపిరెడ్డిహిల్స్ గ్రౌండ్లో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. గోపీనాథ్ ఆశయాలను అందరూ కలిసి ముందుకు తీసుకెళదామని పేర్కొన్నారు.
మీ ఇంటి ఆడబిడ్డ అనుకుని ఆదరించాలని కోరారు. మాగంటి గోపీనాథ్ జ్ఞాపకాలను స్మరించుకుంటు విలపిస్తుండగా.. గమనించిన మాజీ మంత్రి కేటీఆర్ వాటర్ బాటిల్‌ను ఆమె ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య వెంటనే సునీతను ఓదార్చారు. మనసంతా బాధతో నిండటంతో సునీతమ్మ ఇక మాట్లాడకుండానే మైక్ ఇచ్చేసి రోదించడం వేదికపై ఉన్న బీఆర్ఎస్ అగ్రనాయకులతో పాటు అందరిని కదిలించింది. రహ్మత్ నగర్ ప్రాంతమంగా గులాబీమయంగా మారిపోయింది.