శంషాబాద్ రూరల్, జూలై 17: రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్‌తో కిషన్ రెడ్డి కలిసి సోమవారం ఏర్పాట్లును పరిశీలించారు. వాహనాల పార్కింగ్, నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు భారీగా చేపట్టాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.
అనంతరం, ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా పార్టీ కార్యాలయం ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారని, అందుకు జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్యాలు, ఆటపాటలతో పండుగగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు. 20 తర్వాత పూర్తి స్థాయిలో జిల్లా కమిటీతో పాటు జిల్లా అనుబంధ శాఖల కమిటీలను పూర్తి చేస్తామని వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొలను సుష్మా మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బుర్కుంట సతీష్, కౌన్సిలర్లు చెన్నం ఆశోక్, భారతమ్మ, అమృతారెడ్డి, మేకల వెంకటేశ్, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.