జియాగూడ, ఏప్రిల్ 3 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్నారని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గం దత్తాత్రేయనగర్ డివిజన్ పరిధిలోని జిర్రా నటరాజ్ నగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా పథకాలు అమలు జరుగాలని అన్ని రాష్ర్టాల ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లభించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్ మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
కోతలు లేని విద్యుత్ సరఫరాను చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందన్నారు. నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ దవాఖానలలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు సంతోష్ గుప్తా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో చెక్కు చెదరని ఆదరణ ఉందన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుదర్శన్ రాథోడ్, దత్తాత్రేయనగర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు హుస్సేన్, మహ్మద్ అజహర్, అన్వర్, యాసిన్, సయ్యద్, ఒమర్ పాల్గొన్నారు.