బడంగ్‌పేట, ఆగస్టు 6: మీర్‌పేటలో అదృశ్యమైన బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. బాలుడు అదృశ్యమయ్యాడా..? ఎవరైనా కిడ్నాప్ చేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాసరి నారాయణరావు కాలనీలో నివాసముండే మధుసూదన్ రెడ్డి, కవిత దంపతుల కుమారుడు 13 ఏండ్ల మహేందర్ రెడ్డి (లిట్టు) ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
ఆదివారం సాయంత్రం 3.45 గంటల సమయంలో ట్యూషన్‌కు పోయి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రమైనా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మీర్‌పేట పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బాలుడి కదలికలను పోలీసులు కనిపెట్టారు.
ఓ ద్విచక్ర వాహనంపై ఎక్కి బాలుడు వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో బాలుడి కోసం నిఘా పెట్టారు. బాలుడు మలక్‌పేట నుంచి కాచిగూడ రైల్వేష్టేషన్ పోయాడని, కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్లాడు. తిరుపతిలో దైవ దర్శనం చేసుకొని.. ఒకరి దగ్గర ఫోన్ తీసుకొని తల్లిదండ్రులకు కాల్ చేశాడు. వస్తున్నానంటూ.. తల్లిదండ్రులతో చెప్పాడు.
ఈ విషయాన్ని తల్లిదండ్రులు వెంటనే మీర్‌పేట పోలీసులకు తెలిపారు. మీర్‌పేట పోలీసులు తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన తిరుపతి పోలీసులు.. బాలుడిని మీర్‌పేట పోలీసులకు పంపిస్తున్నట్లు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి నేరుగా మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన ఇన్స్పెక్టర్ నాగరాజు.. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అదృశ్యం కథ సుఖాంతం కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతికి ఎందుకు వెళ్లావంటూ బాబును పోలీసులు ప్రశ్నించారు.
దేవుడిని దర్శించుకునేందుకు వెళ్లినట్టు బాబు చెప్పాడు. డబ్బులు ఎక్కడివని పోలీసులు ప్రశ్నించగా.. దాచుకున్న పాకెట్ మనితో వెళ్లినట్టు తెలిపాడు. ఇప్పటి వరకు 15 సార్లు అమ్మనాన్నతో కలిసి తిరుపతి వెళ్లినట్టు చెప్పాడు. బాబు క్షేమంగా ఇంటికి వచ్చేందుకు సహకరించిన ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, విజయలక్ష్మి, మీర్‌పేట పోలీసులు, మీడియా ప్రతినిధులకు బాలుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.