“గూడు అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అందుకోలేని అందలం. ఎంతో మంది జీవిత ఆశయంలా పెట్టుకొని అందుకోలేక తుదకు విసిగివేసారిపోయి సతికిలపడుతుంటారు. సామాన్యులకు ఇండ్లు, స్థలాల విషయంలో ఎన్నో ఇబ్బందులు, అనుమతులు రాకపోవడం లాంటివి కొండలాంటి కోర్సుగా దాపురించేవి. కానీ, వీటిన్నింటినీ అధిగమించి ఎన్నో ఏండ్లుగా అందని పరిష్కారం ఒక్కసారిగా అందితే.. ఆ తృప్తే వేరబ్బా అంటున్నారు సగటు మనుష్యులు. అయితే, బోరబండలోని ఎన్ఆర్ఆర్ పురంలో నాలుగు దశాబ్దాలుగా ఫలించని ఇంటి / ప్లాట్ కల నెరవేరింది. దీంతో లబ్ధిదారులు సంతోషాల సంబరాలు ఒక్కసారిగా బయల్పడ్డాయి. గూడు దక్కింది.. సంతోషంతో గుండె తబ్బిబ్బయ్యింది.. గుండె గూటికి పండగొచ్చింది. లబ్ధిదారుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇదంతా గత ప్రభుత్వాల వల్ల కాలేదు. నాలుగు దశాబ్దాల నుంచి కానీ పని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అయ్యింది.”
వెంగళరావునగర్, ఆగస్టు 11: గూడు దక్కింది.. గుండె సంతోషంతో ఉప్పొంగింది. ఆనందోత్సాహాలతో మనిషి మనసు ఉరకలేసింది. బోరబండ డివిజన్ ఎన్ ఆర్ ఆర్ పురం (నూకల రాంచంద్రారెడ్డి పురం) కాలనీకి సంబంధించిన నాలుగు దశాబ్దాల స్వప్నం సాకారమైంది. పేదలు, మధ్య తరగతివాసులకు సంబంధిత ఇళ్లపై లబ్ధిదారులకే తెలంగాణ ప్రభుత్వం హక్కు కల్పించింది. 1976వ సంవత్సరంలో బోరబండ ఎన్ ఆర్ ఆర్ పురంలో సైట్ 1, 2, 3, 4, 5 పేర్లతో 61 ఎకరాల 20 గుంటల్లో హుడా లేఔట్ వేసి, ఎన్ ఆర్ ఆర్ పురం హౌసింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగులైన డ్రైవర్లు, అటెండర్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. 1407 ఇళ్లు, 400 ఓపెన్ ప్లాట్లతో లేఔట్‌ను అప్పట్లో హైదరాబాద్ అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (హుడా) తయారు చేసింది. 110 గజాల స్థలాన్ని ఒక్కో ఇంటికి కేటాయించారు.
ఓపెన్ ప్లాట్‌కు 90 గజాల స్థలాన్ని అప్పట్లో అధికారులు మంజూరు చేశారు. అప్పటి హుడా నుంచి అలాట్మెంట్ ఉన్నప్పటికీ 14 ఏళ్ల క్రితం వరకు వీటికి రిజిస్ట్రేషన్లు లేవు. 2009వ సంవత్సరంలో ఎన్ ఆర్ ఆర్ పురం ఇళ్లు, స్థలాలకు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చాలా మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కుటుంబ పోషణ, ఇబ్బందులు, అవసరాల కోసం 1500 మంది స్థలాలు, ఇళ్లను అమ్ముకున్నారు. వీటిని కొనుగోలు చేసిన థర్డ్ పార్టీకి రిజిస్ట్రేషన్లును చేయడానికి హుడా నిరాకరించింది. దాంతో ఆ ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలంటే, కట్టుకున్న ఇళ్లకు అనుమతులు కావాలంటే జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు రాని పరిస్థితి. బ్యాంకుల నుంచి రుణాలు కూడా దక్కని స్థితి. ఇటు రిజిస్ట్రేషన్లు కాకపోవడం, ఇళ్లు కట్టుకోలేని పరిస్థితులు ఉండటం ఇంకోవైపు బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడంతో లబ్ధిదారులు నైరాశ్యం పాలయ్యారు.
దశాబ్దన్నర కాలం నుంచి సమస్య నలుగుతోంది. కొందరు రాజకీయ నాయకులు, దళారులు తమ పలుకుబడితో ప్రభుత్వంతో పని చేయిస్తామంటూ నమ్మించి లబ్ధిదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి స్థానిక జనాన్ని మోసగించారు.
మాట మర్చిన నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం నల్లారి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బోరబండలో నిర్వహించిన రచ్చబండలో ఎన్ఆర్ఆర్ పురంలో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసిన థర్డ్ పార్టీ వారికి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. రచ్చబండ పూర్తై ఆఫీసుకు వెళ్లగానే ఫస్ట్ ఆ ఫైల్‌పైనే సంతకం చేస్తానని చెప్పిన నాటి సీఎం తన హామీని విస్మరించారని, తమ గూడు గోస పట్టించుకోలేదని జనం వాపోయారు. కొనుగోలు చేసిన ఇంటిలో ఉంటున్నామే కానీ, ఇంటిపై ఎలాంటి హక్కులు మాత్రం ఇన్నాళ్లు లేవన్నారు. అప్పట్లో కొన్న ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకుందామంటే నిబంధనల పేరుతో జీహెచ్ఎంసీ అనుమతి నిరాకరించింది. థర్డ్ పార్టీ వారికి రిజిస్ట్రేషన్ చేసేదేలేదని హుడా తెగేసి చెప్పింది. ఎన్ ఆర్ ఆర్ పురవాసులకు ఇళ్లు, స్థలాలపై హక్కు కల్పిస్తే జీవో ఇస్తామని మాటిచ్చిన నాటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి తమల్ని నమ్మించి మోసం చేశారని వాపోయారు.
సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లిన మాగంటి
సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించడానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎంతో చొరవ తీసుకున్నారు. ఎన్ ఆర్ ఆర్ పురంలో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసిన పేదలు, మధ్యతరగతి వాసుల సాధక బాధకాలను అర్థం చేసుకున్న కేసీఆర్ సార్ సానుకూలంగా స్పందించారు. ఎన్ ఆర్ ఆర్ పురం హౌసింగ్ సొసైటీ వాసుల కోసం థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్లకు ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.96ను విడుదల చేసింది. అప్పటి హుడా ఇప్పుడు హెచ్ఎండీఏతో పాటు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలిచ్చింది. రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్ చార్జ్‌ను తగ్గించింది. స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ కూడా కల్పించింది. నేటి మార్కెట్ ధర ప్రకారం రూ.3 నుంచి 4 లక్షలు అయ్యే రిజిస్ట్రేషన్‌ను కేవలం రూ.15 వేల నుంచి రూ.30 వేల లోపే రిజిస్ట్రేషన్ ఖర్చు తగ్గిపోవడంతో లబ్ధిదారుల కళ్లల్లో సంతోషానికి తాండవం చేస్తోంది. దీంతో రూ.30 కోట్ల వరకు ప్రభుత్వం రాయితీ ఇచ్చినట్లయ్యింది.
13న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత సభ..
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు కృతజ్ఞత తెలుపేందుకు బోరబండ ఎన్ ఆర్ ఆర్ పురంలో ఈ నెల 13న సభను నిర్వహించనున్నాం. అడుగడుగునా ముఖ్యమంత్రి సార్ చిత్రపటానికి ఎన్ ఆర్ ఆర్ పురంలో పాలాభిషేకాలు చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. పని చేసే ప్రభుత్వం మాది. పేదల పక్షపాత ప్రభుత్వం మాది. పేదలకు ఏ కష్టమొచ్చినా తీర్చేందుకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇక్కడి జనాన్ని పట్టించుకోలేదు. నాలుగు దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
– మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
కష్టాలన్నీ కొండెక్కాయి.. మరిచిపోలేని మేలు..
మా కష్టాలన్నీ కొండెక్కాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మరిచిపోలేని మేలు చేశారు. ఆయన నిజంగా పేదల మనిషి. పేదలు, మధ్యతరగతి వాసుల కష్టాలన్నీ తెల్సుకున్న ముఖ్యమంత్రి మనసెరిగి మాకెంతో మేలు చేశారు. రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతించడమే కాకుండా స్టాంప్ డ్యూటీలో, రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ కల్పించి పేదలు, మధ్యతరగతి పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చొరవతోనే మా సమస్య తీరిపోయింది.
– ఎం ఏ మజీద్, ఎన్ ఆర్ ఆర్ పురం సైట్-3 నివాసి
మంచితనం మూర్తీభవించిన నేత ‘మాగంటి’
మంచితనం, సేవాగుణం మూర్తీభవించిన నేత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు. నిజంగా మంచి మనస్సున్న గరీబోళ్ల నాయకుడు గోపీ సార్. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ కొనుగోలు చేసిన ఇళ్లు, స్థలాలు రిజిస్ట్రేషన్లు కాకపోవడం.. ఇళ్లపై ఎలాంటి హక్కులు లేకపోవడం గమనించి పేదలు, మధ్యతరగతి వాసుల బాధల్ని చూసి చలించారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి… కానీ, గతంలోని ఏ ప్రభుత్వాలకు మా బాధ పట్టలేదు. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే వరకు ఎమ్మెల్యే గోపీనాథ్ గారు కృషి చేశారు.
– ఎం ఏ సత్తార్, అధ్యక్షుడు – ఎన్ ఆర్ ఆర్ పురం హౌసింగ్ సొసైటీ
మా ఇంటి దీపం వెలిగించిన దేవుడు కేసీఆర్
మా ఇంటిలో దీపం వెలిగించిన దేవుడు కేసీఆర్ సార్. నిరుపేదలు, మధ్యతరగతి వాసుల ఇంటిలో వెలుగులు నింపడమే కాకుండా.. ఆ దీపం ఆరిపోకుండా ఉండేందుకు ఎమ్మెల్యే మాగంటి తన చేతులను అడ్డుపెట్టారు. ఆ దీపం నిరంతరం వెలిగేందుకు కావాల్సిన ఇంధనాన్ని ముఖ్యమంత్రి పెద్ద మనస్సు చేసుకుని సమకూర్చారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ కల్పించి మా ఇంటి దీపం దేదీప్యమానంగా వెలిగేలా మాకు ఇన్ని రాయితీలు కల్పించారు. నిజంగా మనస్సున్న మారాజు కేసీఆర్ సార్.
– సూర్యకళ, ఎన్ ఆర్ ఆర్ పురం వాసి