సిటీ బ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్వోల నిర్లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లను ఆందోళనకు గురిచేస్తున్నది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 99 శాతానికి పైగా పూర్తయిందని ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో దానికి పూర్తి భిన్నంగా ఉన్నది. 50 శాతానికి పైగా బీఎల్వోల వద్దనే ఎన్యుమరేషన్ ఫారాలు దర్శనమిస్తున్నాయి. డిజిటలీకరణ పది శాతానికి మించడం లేదు. ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ సజావుగా సాగుతున్నదని చెప్పుకునేందుకే లెక్కల్లో చూపుతున్నట్లు తెలుస్తున్నది.
కానీ ఎన్నికల కమిషన్ ప్రకటనలతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. బీఎల్వోలు తమ ఇండ్లకు రాకుండానే.. ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే పంపిణీ పూర్తయిందని ప్రకటించడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ ఓట్లను తొలగించేందుకే ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరగకుండానే సంబంధిత బూత్‌లోనే తిష్టవేసి ఉంటున్నారు. ఓటర్లు వచ్చి తమకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాలని అడిగితే తప్ప ఏమాత్రం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఎన్నికల కమిషన్ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బీఎల్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్ల భవితవ్యాన్ని నిర్దేశించే అత్యంత ముఖ్యమైన సర్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నామమాత్రంగా చేపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల, సింగాడకుంట ప్రాం తాల్లోని సుమారు 10 పోలింగ్ బూత్‌లలో సుమారు 15వేలమంది ఓటర్లు ఉన్నారు. వారికి సంబంధించిన ఎస్ఐఆర్ ఫారమ్స్ పంపిణీ 99శాతం పూర్తయినట్లు బీఎల్వోలకు చెందిన యాప్స్‌లో డ్యాష్ బోర్డులో నమో దు చేశారు. అయితే ఒక్కో బీఎల్వో దగ్గర ఇప్పటికీ సుమారు 300 నుంచి 400 దాకా పంపిణీ చేయని దరఖాస్తు ఫారమ్స్ ఉన్నాయి.
ఇదేంటని ప్రశ్నించగా ఉన్నతాధికారులు చెప్పినట్లు చేస్తున్నామని, వారం రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి ఫారమ్స్ అందించినా కొంతమంది మాత్రం వేరే ఇండ్లకు మారారని చెప్తున్నట్లు వెల్లడించారు. వారి దరఖాస్తు ఫారాలు తమవద్దనే పెండింగ్‌లో ఉన్నాయని, సదరు వ్యక్తులు వచ్చి తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. అయితే దరఖాస్తులు ఇవ్వకపోవడంతో చాలామంది ఓట్లను షిప్టెడ్ అని రాసి.. ఆన్లైన్లో ఓట్ల తొలగింపునకు ప్రతిపాదనలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. వీటి తొలగింపును స్థానికంగా ఉండే బీఎల్వోలు, రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏల మీదకు నెట్టేసి చేతులు దులుపుకొనే కుట్రలు జరుగుతున్నాయని వాపోతున్నారు.
ఖైరతాబాద్: ఖైరతాబాద్‌లో అధికారులు చెబుతున్న లెక్కల్లో 99 శాతం పూర్తయినట్లు ఆన్లైన్లో పొందుపరుస్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఖైరతాబాద్, సోమాజిగూడ, ఎర్రమంజిల్కాలనీ డివిజన్లలో బీఎల్వోలు ఒకేదగ్గర ఉండి ఓటర్లనే వారి వద్దకు రప్పించుకుంటున్నారు. ఒక్కో బీఎల్వో 1400లకు పైగా ఫారాలు పంపిణీ చేయాల్సి ఉండగా, అందులో 40 శాతం కూడా పంపిణీ చేయడం లేదని తెలిసింది. డిజిటల్ నమోదులో మాత్రం ప్రతి రోజు నూటికి 99.9 శాతం పూర్తయినట్లు రికార్డుల్లో చేరుస్తున్నారు. కొన్ని చోట్ల సర్ కార్యక్రమం అనేది జరుగుతుందా లేదా అనే విషయం సైతం స్థానిక ప్రజలకు తెలియకపోవడంతో అరకొరగా ఏర్పాటు చేసిన శిబిరాల వద్దకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. 1000 దరఖాస్తుల్లో 700 మందికి డబుల్ ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2002 తర్వాత మృతిచెందిన ఓటర్ల వివరాలను ఇంకా ఆన్లైన్ డేటా నుంచి తొలగించనట్లు తెలిసింది.
సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. 99 శాతానికి పైగా ఫారాల పంపిణీ పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు అధికారికంగా లెక్కలు చూపుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం 50 శాతం కూడాపూర్తి కాలేదు. దీంతో ఓటర్లు నింపిన ఫారాలను ఆన్లైన్ చేయడంలో మరింత ఆలస్యం అవుతున్నది. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో ఫారాల పంపిణీ శనివారం నాటికి 99.88 శాతం పూర్తయినట్లు వెబ్సైట్లో నమోదు చేశారు. జిల్లాలో 47,36,669 మంది ఓటర్లుండగా 47,30,983 మందికి పంపిణీ చేసినట్లు చూపుతున్నారు. అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో 29,79,130 ఓటర్లకు 29,72,800 మందికి పంపిణీ చేసినట్లుగా 99.79 శాతం పూర్తయినట్లు చూపారు. రంగారెడ్డి జిల్లాలో 36,99,743 ఓటర్లకు 36,97,012 మందికి పంపిణీ చేసినట్లుగా 99.93 శాతం పూర్తయినట్లు అధికారికంగా తెలిపారు. కానీ డిజిటలీకరణ మాత్రం హైదరాబాద్‌లో 10.19 శాతం, మేడ్చల్ 6.07 శాతం, రంగారెడ్డి జిల్లాలో 18.39 శాతం పూర్తి చేసినట్లు వెబ్సైట్లో నమోదు చేశారు.