జవహర్‌నగర్, జనవరి 18: మాజీ సీఎం కేసీఆర్ పేదలకు ఇండ్ల పట్టాలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఇండ్లను బుల్డోజర్తో కూల్చడమే పనిగా పెట్టుకుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో దళిత, గిరిజన, పేద బీసీ వర్గాల ప్రజలు 60, 80 గజాల స్థలాల్లో రేకుల ఇండ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారని, వారి ఇండ్లను కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు. శనివారం జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధి అరుంధతినగర్‌లో ఎంపీ ఈటల పర్యటిస్తూ పేదలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పేదలు కష్టార్జితంతో కట్టుకున్న ఇంటికి కాంపౌండ్‌వాల్ నిర్మించుకోవాలన్నా, అదనంగా మరో రూమ్ కట్టాలన్నా రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో అందజేస్తేనే గూడు నిలుస్తుందని, లేకుంటే ఫిర్యాదుల పేరుతో బుల్డోజర్తో కూల్చివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. కుటుంబ నియంత్రణ కింద పేదలకు ఇండ్ల పట్టాలను అందజేసిన ప్రభుత్వం.. ఇందిరా ఆవాస్ యోజన పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకుంటే.. అదే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గూడును కూల్చివేస్తున్నదని అన్నారు.
జవహర్‌నగర్‌లో పేదలు నిర్మించుకున్న ఇండ్ల జోలికి వస్తే… అరుంధతినగర్ నుంచే ప్రభుత్వంపై యుద్ధభేరి మోగిస్తానని శపథం చేశారు. పేదలు ఇండ్లు నిర్మించుకుని కరెంటు, ఇంటి నెంబర్లు తెచ్చుకుంటే హుడా అధికారులు 2500 ఎకారల స్థలం తమ సంస్థది ఉందంటూ రావడమేమిమని ఆయన ప్రశ్నించారు. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం అధికారులు కూల్చివేసిన ఇండ్లను పరిశీలించారు. కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, మేడ్చల్ రూరల్ ఓబీసీ మోర్ఛా అధ్యక్షుడు మహేందర్‌యాదవ్, కార్పొరేటర్ పానుగంటి బాబు, రంగుల శంకర్, పార్టీ జవహర్‌నగర్ అధ్యక్షుడు కమల్, సంతోష్, సందీప్, యాదగిరి, అరుంధతినగర్ వాసులు పాల్గొన్నారు.