Etala Rajender | జగద్గిరిగుట్ట, మార్చి 8: ప్రజల ఆస్తులపై హైడ్రా కత్తి వేలాడదీసి సీఎం రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. జగద్గిరిగుట్ట కొండపై ఉన్న ఆలయాలకు ఇటీవల హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం జగద్గిరిగుట్టలోని ఆలయాల నిర్వాహకులతో ఎంపీ ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీరును ఆయన విమర్శించారు. ఓటేసి గద్దెనెక్కించిన ప్రజలకే అన్యాయం జరిగేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ఇదే ప్రాంతం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రేవంత్ రెడ్డి జగద్గిరిగుట్ట వాసులకు అన్యాయం చేయడం తగదన్నారు. కోట్లాది రూపాయల విలువైన భూముల కబ్జాలను అడ్డుకోకుండా పేదలు నిర్మించుకున్న ఇల్లు, ఆలయాలపై కక్ష సాధించడం సరికాదన్నారు.
రంగనాథ్ మంచి అధికారి అయినా ఆయన వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. నల్ల చెరువులో కూల్చివేతల సందర్భంగా హైడ్రా పేరుతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తు చేశారు. అది హైడ్రా, సర్కారు చేసిన హత్య అని అన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల పొట్ట కొట్టి కార్పొరేట్ తరహా నిర్మాణాలు చేపట్టే ఉద్దేశం మంచిది కాదన్నారు. నీటిని శుద్ధి చేయడం కోసం ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటు చేయాలన్నారు. జీడిమెట్ల రసాయన వ్యర్థాలపై చర్యలేవని ప్రశ్నించారు. సీఎం మిగిలిన మూడున్నర ఏళ్ల కాలాన్ని అయినా సరిగా పాలించాలని సూచించారు. జగద్గిరిగుట్ట ఆలయాల రక్షణకు తాను అండగా నిలుస్తానని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.