Numaish | హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏటా నిర్వహించే నుమాయిష్‌పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరం మధ్యలో ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం వల్ల.. దీనికి వచ్చే వేలాది మంది ప్రజలతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతుందని తెలిపారు. గంటల తరబడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు.
గతంలో నుమాయిష్‌లో అగ్నిప్రమాదాలు జరిగిన సంఘటనలను కూడా రాజాసింగ్ గుర్తుచేశారు. ఇరుకు ప్రదేశం కావడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అన్నారు. అందుకే నుమాయిష్‌ను నగరం అవతలకు మార్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీ బయట 100-200 ఎకరాల్లో ఈ నుమాయిష్‌ను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.
నుమాయిష్‌కు వచ్చే వారి నుంచి పార్కింగ్ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారని రాజాసింగ్ అన్నారు. కారు పార్కింగ్‌కు రూ.150 వసూలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. నుమాయిష్ పార్కింగ్ లాట్ కేటాయింపుల్లోనూ పెద్ద కుంభకోణం ఉందని రాజాసింగ్ ఆరోపించారు.ఈ పార్కింగ్ ఛార్జీల ఖరారుకు టెండర్ పిలిచారా అని ప్రశ్నించారు. ఛార్జీలపై జిల్లా కలెక్టర్ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం వచ్చే వారి కోసం నిర్వాహకులే ఉచితంగా పార్కింగ్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయినా ప్రభుత్వ స్థలంలో పార్కింగ్ ఫీజులు వసూలేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో ఫ్రీ పార్కింగ్ కల్పించాలని కోరారు.