బడంగ్‌పేట, ఆగస్టు 30: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన బీజేపీ నేతలు, పీఏసీఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, మాజీ సర్పంచ్ బండారు లావణ్య లింగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండవా కప్పి..పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. బీజేపీ పార్టీకి మతం, దేవుడు, కులం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప.. ప్రజల అవసరాలు గుర్తుకు రావన్నారు. కాంగ్రెస్ మార్పు తీసుకొస్తామని ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడం లేదన్నారు.