కంటోన్మెంట్, మార్చి 5: ఎన్నికలంటే పోటాపోటీగా ఉంటాయి. అభ్యర్థుల ఎత్తులు.. పై ఎత్తులు కనిపిస్తాయి. కానీ వార్ వన్ సైడ్ అనుకుంటే….ప్రతిపక్షాలు డీలా పడితే.. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ నామమాత్రంగా కనిపిస్తోంది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బీఆర్ఎస్కు ఎదురు లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎన్నికల షెడ్కూల్డ్ విడుదలైనప్పటికీ బీజేపీ, కాంగ్రెస్‌లో ఉలుకూ పలుకూలేదు. బీజేపీ నుంచి ఎనిమిది వార్డుల్లో పోటీలో నిలిచే అభ్యర్థులు లేక కమలం నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఆయా వార్డుల్లో ఉన్న నేతలు సైతం పార్టీకి రాజీనామాలు చేసి బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే రెండో వార్డుకు చెందిన సదా కేశవరెడ్డి పార్టీని వీడగా, తాజాగా మరో రెండు రోజుల్లో పలు వార్డులకు చెందిన నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూల్డ్ రాకముందు బీరాలు పలికిన కమలం నేతలకు అభ్యర్థులు దొరకకపోవడం, ఉన్న నేతలు పార్టీని వీడుతుండటంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. నానాటికీ పార్టీ పరిస్థితి దిగజారుతున్నా పార్టీకి చెందిన పలువురు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా 1వ వార్డు నుంచి జంపన ప్రతాప్, ఆరో వార్డు నుంచి భానుకా నర్మదలు మాత్రమే పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నాలుగో వార్డులో బీజేపీకి అంటిముట్టనట్లు ఉంటున్న గడ్డం శ్రవణ్‌ను బీఆర్ఎస్ నుంచి రంగంలోకి దింపాలని గులాబీ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐదో వార్డు మహిళా రిజర్వేషన్ కావడంతో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, మరో నేత సత్తిరెడ్డిలు ఎవరికి వారే కుటుంబసభ్యులను దింపాలని యోచిస్తున్నా స్పష్టత లేదు. మిగతా ఐదు వార్డుల్లో అభ్యర్థులు పోటీకి ముందుకు రాకపోవడంతో బీజేపీ శ్రేణులు గందరగోళంలో పడ్డారు.
కంటోన్మెంట్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఓ వైపు పార్టీ మద్దతుతో బరిలోకి దిగేందుకు అభ్యర్థులు కరువవ్వడంతో ఎన్నికలను అడ్డుకునేందుకు కుటిల యత్నాలకు పాల్పడుతున్నారు. వార్డుల పునర్విభజన చేయడంతో పాటు తొలగించిన ఓట్లు చట్టం ప్రకారం జరగలేదంటూ కోర్టు మెట్లక్కడంతో పాటు రక్షణశాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టిన రక్షణశాఖ ఫిర్యాదు చేసింది బీజేపీ నేతలే కావడంతో ఎన్నికలను వాయిదా వేసేందుకు సైతం వీలుకల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మరోవైపు ఓటమి భయంతో బీజేపీ నేతలు సుధీర్ఘ కాలం తరువాత జరుగుతున్న బోర్డు ఎన్నికలను అడ్డుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారని పలు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు మండిపడుతున్నారు.
ఆరో వార్డులో ఇంటింటా ప్రచారం ప్రారంభించిన బోర్డు మాజీ సభ్యులు
కంటోన్మెంట్, మార్చి 5: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంట్లో భాగంగా ఆరో వార్డు నందమూరినగర్‌లో బోర్డు మాజీ సభ్యుడు విద్యావతి పాండుయాదవ్ దంపతులు పాదయాత్ర చేపట్టారు. శనివారం రాత్రి ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, తమ గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకుసాగారు. అనంతరం స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరిస్తూ ప్రజలతో మమేకమవుతూ కదిలారు. ఏప్రిల్ 30న జరిగే పోలింగ్‌లో భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. గత ఏడేళ్లుగా వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని విద్యావతిపాండుయాదవ్ దంపతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.