Harish Rao | జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ వచ్చుడే కష్టమని హరీశ్‌రావు అన్నారు. భర్తను కోల్పోయిన ఆడబిడ్డను మీరందరూ దీవించాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటారని.. కానీ గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌కు 100 కోట్లు ఇచ్చి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని గుర్తుచేశారు. ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ అవుతుందా అని ప్రశ్నించారు.
బీజేపీ సీనియర్ మహిళా నాయకులు కళావతి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు లక్ష్మీ, మహిళా మోర్చా నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మీ, అనురాధ, మంజుల, సత్యవతితో పాటు 200 మంది బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ నీటిని దోపిడి చేసే బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర బీజేపీ మద్దతిస్తున్నదదని.. అనుమతులు ఇస్తున్నదని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణకు ఏమిస్తున్నారో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ప్రకటిస్తే ఒక్క మెడికల్ కాలేజీను కూడా తెలంగాణకు ఇవ్వలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన బీజేపీ.. తెలంగాణకు పది పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీకి 8 ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన మంచి ఇదేనా అని ప్రశ్నించారు.
గోధుమలకు రూ.2585, వడ్లకు రూ.2369 మద్దతు ధర ఇస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. గోధుమలకు ఓ నీతి వడ్లకు మరో నీతి ఉంటుందా అని నిలదీశారు. ఉత్తర భారత దేశంలో అయినా తెలంగాణలో అయినా రైతు రైతే అని అన్నారు. 2014లో బీజేపీ అధికారంలో వచ్చిన నాడు గోధుమలకు, వడ్లకు 1400 మద్దతు ధర ఉండేదని తెలిపారు. గోధుమలకు మద్దతు ధర పెంచి వడ్లకు పెంచకపోవడం తెలంగాణ రైతులకు అన్యాయం చేయడమే అని మండిపడ్డారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే గోధుమలు పండించే రైతైనా.. వడ్లు పండించే రైతైనా రైతే అని స్పష్టం చేశారు. వడ్లు పండించడం తెలంగాణ రైతులకు శాపమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లా అన్ని విషయాల్లో బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.
తెలంగాణ గొంతు నొక్కడంలో కాంగ్రెస్ బీజేపీ దొందూ దొందే అని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని.. మన కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని తెలిపారు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి తెచ్చింది కేసీఆర్.. కేసీఆర్ కిట్టు తెచ్చింది కేసీఆర్.. 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి అవ్వాతాతల గౌరవం పెంచిండు కేసీఆర్.. షీ టీమ్స్ తో ఆడపిల్లల భద్రత పెంచిండు కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ వి మొసలి కన్నీళ్లు, ఆపదమొక్కులు తప్ప ప్రజల సంక్షేమం లేదని విమర్శించారు. కాంగ్రెస్ కి నిజాయితీ ఉంటే బాకీ కార్డు పంపిస్తాం. మీరు పడ్డ బాకీ ని చెల్లించి జూబ్లీహిల్స్ లో ఓటు అడగండని సూచించారు.