ఖైరతాబాద్, ఏప్రిల్ 22 : హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పటాకుల కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఈ నెల 19న నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలోని ఐదో అంతస్తులోని ఆడిటోరియంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం విదితమే. అయితే ఇదే ఘటనలో పటాకులు సైతం బయటపడటంతో దవాఖానలోని భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఇప్పటికే ఈ ఘటనలపై పంజాగుట్ట పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా, అగ్ని ప్రమాదానికి మాత్రం సిగరెట్లు, బీడీలే కారణమని ధ్రువీకరించారు. ఇక పటాకుల కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా వాటిని మాయం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు ఐదో అంతస్తులో కనీసం సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసును ఎటు తేల్చాలో అర్థం కాక పోలీసు అధికారులు తలలు పట్టుకొని కూర్చోగా ఓ అధికారి ఇచ్చిన వాంగూల్మం వారి కేసుకు బలం చేకూర్చినట్లు తెలుస్తోంది.
ఆ వీడియోలు నిజమే…
నిమ్స్ ఆడిటోరియంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన సమయంలో దానికి ఆనుకొని ఉన్న ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పటాకులు దర్శనమిచ్చాయి. నిమిషాల వ్యవధిలోనే దానికి సంబంధించిన ఆ వీడియోలన్నీ ప్రసార మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అక్కడికి చేరుకోగా, గంటల వ్యవధిలోనే అవి మాయమయ్యాయి. కాగా, అవన్నీ ఫేక్ వీడియోలని తేల్చే పనిలో నిమ్స్‌లోని ఓ వైద్యాధికారి ఉండగా, ఆ వీడియోలు తానే తీశానంటూ మరో వైద్యాధికారి నిమ్స్ డైరెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడమే కాకుండా….నేరుగా పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసు ఉన్నతాధికారికి సైతం వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పటాకుల కేసులో కొత్త ట్విస్టు నెలకొంది. ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పటాకులున్నట్లు తనకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి వీడియోలను తీసి సాక్షాలను సేకరించానని సదరు అధికారి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో అసలు దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నలుగురు సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు
ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పటాకుల కేసులో వైద్యాధికారి ఇచ్చిన వాంగూల్మం పోలీసుల దర్యాప్తునకు బలం చేకూర్చింది. అయితే దీపావళికి ఎనిమిది నెలలు ఉండగానే ఇక్కడ పటాకులు స్టాకు చేసుకోవాల్సిన అసరం ఎవరికి వచ్చింది. లేక గతేడాది పండుగ కోసం తెచ్చిందా..పెద్దల ఫంక్షన్ల కోసం ఎవరైనా తెచ్చి పెట్టుకున్నారా అన్నది ఇంకా తేలలేదు. సాధారణంగా నిమ్స్‌లోని పలు వార్డుల్లో సిబ్బంది నైట్ డ్యూటీలు సైతం చేస్తుంటారు. అయితే అక్కడ పటాకులు రావడానికి ఆ సిబ్బందే కారణమై ఉంటారని భావించారేమో.. ఇప్పటికే ఓ వైద్యాధికారి ఆరోగ్యశ్రీ సిబ్బందికి కొన్ని ప్రశ్నలతో మల్టీపుల్ చాయిస్లో అకనాలెడ్డ్మెంట్ లేఖలు సైతం అందించినట్లు సమాచారం. కాగా, ఈ కేసును కొందరు అమాయక సిబ్బందిపై నెట్టివేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నలుగురు ఆరోగ్యశ్రీ సిబ్బందిని మాత్రం పోలీసులు విచారిస్తుండగా, అసలు దొంగ ఎవరో పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉందంటున్నారు.