రూ.50లక్షలతో భోలక్‌పూర్ మల్లన్న టెంపుల్ రహదారి నిర్మాణం
హర్షంవ్యక్తం చేస్తున్న స్థానికులు
కవాడిగూడ, మార్చి 16: నాడు అధ్వాన్నంగా ఉన్న రోడ్లు నేడు అద్దంలా దర్శనమిస్తున్నాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను సమన్వయం చేసి రోడ్లకు మహర్ధశ తీసుకొచ్చారు. నూతనంగా రాజా డిలక్స్, భోలక్‌పూర్ డివిజన్లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున్ దేవాలయం (మల్లన్న టెంపుల్) నుంచి అంజుమన్ స్కూల్ వరకు వీడీసీ రోడ్లు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించారు. ఒకప్పుడు ఈ మార్గంలో నడవాలంటేనే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అడుగు ముందుకేశారు. రోడ్డు నిర్మాణంతో నేడు పాదచారులు, ద్విచక్ర వాహనదారులు సాఫీగా ముందుకుసాగుతున్నారు.
రూ. 50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం..
భోలక్‌పూర్ డివిజన్లోని మల్లన్న టెంపుల్ నుంచి దాదాపు 600 మీటర్ల వరకు సీసీ రోడ్లు నిర్మాణం చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఎప్పుడు రద్దీగా ఉండే ఈ మల్లన్న టెంపుల్ ప్రధాన రోడ్డులో భారీ వాహనాలు తిరుగుతుండటంతో తరచూ డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ పగిలిపోయి, మురుగు నీరంతా రహదారి వెంట ఏరులై పారుతుండేదని స్థానికులు తెలిపారు. నేడు సీసీ రోడ్డు వేయడంతో సమస్య పరిష్కారమయ్యిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దశలవారీగా పూర్తి చేస్తున్నాం..
భోలక్‌పూర్‌లో గతంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉండేవి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవతోనే డివిజన్లో సీసీ రోడ్ల నిర్మించారు. నూతనంగా డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు ఏర్పాటుతో సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో కొంత ఆలస్యం జరిగింది. డివిజన్లోని అన్ని బస్తీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. రోడ్ల నిర్మాణ పనులను దశల వారీగా పూర్తి చేస్తున్నాం..
– తిరుపతి, ఏఈ- జీహెచ్ఎంసీ