Borabanda | ఎర్రగడ్డ, మే 24 : బోరబండ పీఎస్ పరిధిలోని మద్యం బెల్టు షాపులకు అడ్డాగా మారింది. ఠాణాకు కూత వేటు దూరంలోనే బెల్టు షాపులను కొందరు దర్జాగా నడుపుతున్నారు. ఇక బంజారా నగర్, వినాయకరావు నగర్, బాబా సైలానీ నగర్ బస్తీల్లో అయితే ఏకంగా లైసెన్సుడ్ బార్లకు ధీటుగా బెల్టు బార్లు వెలిశాయి. మందు బాబుల కోసం షెడ్డులను నిర్మించి బెంచీలు, టేబుళ్లు ఏర్పాటు చేయటం గమనార్హం.
నిత్యం 24 గంటల పాటు మద్యం విక్రయించే ఈ బెల్టు షాపుల వైపు ఎక్సైజ్ దృష్టి పెట్టక పోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. బోరబండ ఠాణా పరిధి అమీర్ పేట ఎక్సయిజ్ స్టేషన్ కిందికి వస్తుంది. అటు ఎక్సైజ్, ఇటు పీఎస్ అధికారులు, సిబ్బంది బెల్టు షాపుల పై దాడులు జరపడం, చర్యలు తీసుకోవడం పూర్తిగా విస్మరించడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలోని బెల్టు దుకాణాలపై తరచూ దాడులు జరిపి చట్టపరంగా చర్యలు తీసుకునేవారు. గత ఏడాదిన్నర నుంచి పట్టించుకోవడం లేదు. దీంతో బెల్టు షాపులు బెల్టు బార్లుగా మారుతున్నాయి.
వైన్ దుకాణాల నుంచి మద్యం..
నేటి రోజుల్లో లైసెన్సుడ్ మద్యం దుకాణాన్ని దక్కించుకోవడం వ్యయంతో కూడుకున్న పని. బెల్టు షాపుల కారణంగా వైన్స్ దుకాణాలపై ప్రభావం పడుతుంది. కానీ బోరబండలో అటువంటిది ఏమీ లేదు. స్థానిక వైన్ షాప్స్ వాళ్లే బెల్టు వ్యాపారం అడ్డాలకు మద్యాన్ని దర్జాగా తరలిస్తున్నారు. దీని వెనుక పలు అనుమానాలున్నాయి. స్థానికంగా లైసెన్సుడ్ వైన్స్ షాప్స్ వాళ్ళు బెల్టు దుకాణాలను నడుపుతున్నారని సమాచారం.
తరచూ ఉద్రిక్తతలు..
బెల్టు షాపుల నిర్వాహకుల ఆగడాలకు హద్దు లేదు. రాత్రి 10 మొదలు తెల్లారే వరకు మందుబాబులు హంగామా చేస్తుంటారు. దీని వల్ల స్థానికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అదేమని స్థానికులు అడిగితే అంతే సంగతులు. బెల్టు దుకాణం నడిపే వారు అక్కడికి వచ్చి స్థానికులను దుర్భాషలాడుతూ దాడికి దిగుతారు. వాళ్ళ భయానికి స్థానికులు బయటికి రావటానికి జంకుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.