కాచిగూడ, జనవరి 2: బీసీలకు భిక్షం వొద్దు, రాజ్యంగబద్ధంగా రావాల్సిన హక్కులను కల్పించాలని, బీసీల ఉద్యమాలు రాజ్యాధికారం దిశగా పయనించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో గురువారం కాచిగూడ అభినందన్ హోటల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. 19వ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలు ఈ నెల 8వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకాల్లో 50 శాతం పోస్టులను బీసీ అధికారులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో 73 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, అందులో 50 వేల మంది బీసీ ఉద్యోగులే ఉన్నారని, అయినప్పటికీ బీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఏ వర్గానికి లేని విధంగా బీసీ ఉద్యోగులకు క్రిమిలేయర్ విధానాన్ని రుద్దడం హేమమైన చర్యగా ఆరోపించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శులు కె.కుమారస్వామి, ముత్యం వెంకన్న గౌడ్, రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్, అశోక్ కుమార్, డాక్టర్ చంద్రుడు, పి.యాదగిరి, శ్రీనివాస్, రాజేందర్, సదానందం, శివాజీ, విజయ కుమార్, రవీందర్, శ్రీకాంత్, అశోక్, వీరన్న, నిఖిల్, తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.