మహా నగరంలో గురువారం పూల కోలాహలం కొనసాగింది. నగరంలో ఏ మూల, ఏ ప్రధాన కూడలి చూసినా
పలు రకాల పూలు జాతర చేశాయి. నగరమంతా పూల సువాసనలతో గుబాళించింది. ఉదయం నుంచి సాయంత్రం పొద్దు పోయేదాకా.. పూల పండుగ ఆడంబరంగా సాగింది.
ఈ నేపథ్యంలో నగరం.. ఓ పూదోటగా అవతరించింది. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని నగరం యావత్తు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చుకొని ‘ఒక్కేసి చందమామ ఒక్క జాము ఆయె చందమామ’ అంటూ పిల్లలు, యువతులు, మహిళలంతా ఒక్కచోట చేరి వేడుకను జనరంజకంగా జరుపుకున్నారు. గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న బతుకమ్మ వేడుక గురువారం సద్దుల బతుకమ్మతో వైభవంగా ముగిసింది.